బడుగులకు ఆత్మగౌరవం విలువ చూపించిన జగన్‌ | ysrcp bus yatra in narasapuram : Andhra pradesh | Sakshi
Sakshi News home page

బడుగులకు ఆత్మగౌరవం విలువ చూపించిన జగన్‌

Published Sat, Oct 28 2023 4:18 AM | Last Updated on Sat, Oct 28 2023 5:30 AM

ysrcp bus yatra in narasapuram : Andhra pradesh - Sakshi

నరసాపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో మాట్లాడుతున్న మంత్రులు విశ్వరూప్, అప్పలరాజు, వేణు, కారుమూరి

నరసాపురం: సమాజంలో బడుగు వర్గాలకు అత్మగౌ­రవం కల్పించి, ఆ విలువ చూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవా­త్మక నిర్ణయాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమాజంలో రాజసంతో జీవించే స్థితికి తెచ్చారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నో అన్యాయాలకు, అవమానాలకు గురయ్యారని మంత్రి అప్పలరాజు చెప్పారు. అడుగడుగునా ఆయన ప్రదర్శించిన కుల అహంకారాన్ని, అధికార మదాన్ని వెనుకబడిన కులాలవారు, దళితులు ఎప్ప­టికీ మరచిపోలేరని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని కులాలు, అన్ని వర్గాలను ఒకేలా చూస్తున్నా­రని, అనేక కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పా­రు.

ఓ మత్స్యకారుడిని మంత్రిని చేశారని, మరో మత్స్యకారుడు మోపిదేవి వెంకటరమణను పార్ల­మెం­టుకు పంపారని తెలిపారు. ఆలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణుడిని డైరెక్టర్‌గా పెట్టా­లని నిబంధన పెట్టి ఆ సామాజికవర్గం గౌరవం పెంచారన్నారు. ఇది నిజమైన సామాజిక సాధికారత అని చెప్పారు. అన్ని జిల్లాల్లో హార్బర్లు నిర్మిస్తున్నారని చెప్పారు.

టీడీపీ హయాంలో కాపులే నష్టపోయారు: మంత్రి వేణుగోపాలకృష్ణ
చంద్రబాబు హయాంలో కాపులే ఎక్కువగా నష్టపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇప్పుడు కాపులు పవన్‌ భ్రమలో పడి ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, సమాజంలో ముందడుగు వేయడానికి సీఎం జగన్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బడుగుల పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మరింత మెరుగుపరిచారని చెప్పారు. ఓ కల్లుగీత కార్మికుడి కొడుకు చెట్టు ఎక్కకుండా, విదేశాల్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కుతున్నాడంటే కారణం వైఎస్‌ కుటుంబమేనని తెలిపారు. అదే చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని సగానికి తగ్గించారని, ఆయన కులం వారి కాలేజీల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచుకోవడానికి అనుమతులిచ్చారని చెప్పారు. 

దళితులు, బీసీలపై జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి: పినిపే
మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ దళితులు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి అని చెప్పారు. కేబినెట్‌లో, నామినేటెడ్‌ పోస్టుల్లో దళితులు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ప్రాధాన్యం చంద్రబాబు పాలనలో కనిపించలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.

అవినీతి లేని పాలన: మోపిదేవి
సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అవినీతి అన్నది లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ జనరంజక పాలన అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక లాంటివారని చెప్పడమే కాకుండా, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్‌ అని తెలిపారు. మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు పాలన నాటి రోజులు తప్పవని చెప్పారు.

నీ పిల్లలను మొగల్తూరులో తెలుగు మీడియం చదివించు పవన్‌ : పేర్ని నాని
సీఎం వైఎస్‌ జగన్‌ పేదలు, బడుగు వర్గాల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెగ బాధపడిపో­యారని, ఆయన పిల్లలను సొంతూరు మొగల్తూ­రులో తెలుగు మీడియం స్కూల్లో చదివించవచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన చర్యలు మరెవరూ చేపట్టలేరని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమన్నారు. 

ఆశలు నిజం చేసిన నాయకుడు జగన్‌ : ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి
ఉన్నతంగా జీవించాలన్న అట్టడుగు వర్గాల కలలను నిజం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని, రూ.1,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంక రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement