నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
టీడీపీ అంటే.. తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారు. వీరి పాలన రుచి చూసిన రాష్ట్ర ప్రజలంతా ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకోబట్టే, వారు చేసిన మోసాలను గుర్తించే 2019లోనే దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని అన్నిచోట్లా ఓడించి బైబై చెప్పారు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సొంత నియోజక వర్గమైన కుప్పం ప్రజలకు కూడా తన పాలనలో మంచి చేయని టీడీపీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తామేం చేశారో చెప్పుకోలేక ఈమధ్య నోటికి ఎక్కువగా పని చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అధికార భగ్న ప్రేమికుడు ఇటీవల రాష్ట్ర ప్రజలను బెదిరించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. సెల్‌ఫోన్ టవర్ నుంచి దూకేస్తామని, రైలు కింద పడతామని, పురుగుల మందు తాగుతామని బెదిరించే వారిలా ఉందని వ్యాఖ్యానించారు.
సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార దినోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ..
నరసాపురం సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం
భయం, నిస్పృహతోనే..
ఈమధ్య చంద్రబాబు తాను రాజకీయాల్లో ఉండాలంటే అసెంబ్లీకి వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపించాలని, లేదంటే తనకు అవే చివరి ఎన్నికలవుతాయని ప్రజల్ని బెదిరిస్తున్నారు. కుప్పంలోనూ గెలవలేననే భయం, నిస్పృహ ఆయనలో కనిపిస్తోంది. ఏ మంచీ చేయని తమకు ఎవరైనా ఓటు ఎందుకు వేస్తారని, ఎందుకు ఓటు వేయాలనిగానీ చంద్రబాబు, దత్త పుత్రుడు చెప్పరు.
ఎందుకంటే వారు చెప్పడానికీ ఏమీ లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5 లాంటి వారితో దోచుకో, పంచుకో, తినుకో అనే ఒప్పందం చేసుకుంటారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో ఉంటే దోచుకున్నది వీరందరితో పంచుకుని తింటారు. అందువల్లే వారంతా ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడరు, చూపించరు, రాయరు. చివరికి ప్రశ్నిస్తాననేవారు కూడా నోరెత్తరు. ఇలాంటి వారందరినీ చూసినపుడు ఇదేం ఖర్మరా బాబూ.. ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయనిపిస్తుంది.
బాబూ.. ఇదేం ఖర్మరా!
ప్రజలు కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబూ అని చెప్పారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబూ అని తల పట్టుకుని కూర్చుంటే.. ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, పార్టీలో, కేబినెట్‌లో స్థానం కల్పించినందుకు ఇదేం ఖర్మరా బాబూ అని అనుకునే ఉంటారు. వీళ్ల ధోరణి చూసి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఇదేం ఖర్మ బాబూ అనుకుంటున్నారు.
ప్రతి ఇంటికీ మంచి జరిగిందా లేదా?
మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ఒకే ఒక్కటి కొలమానంగా తీసుకోండి. ఇవాళ ప్రతి కుటుంబంలోనూ మంచి జరిగిందా లేదా? అన్నది కొలమానంగా చూడండి. మంచి జరిగితే మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా నాకు అండగా నిలబడండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తప్రుతుడిని నమ్మొద్దు. మా మేనిఫెస్టోలో చెప్పినవి 98 శాతం నెరవేర్చాం. మన ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితో ప్రజలంతా ప్రతి ఉప ఎన్నికలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అండగా నిలబడి ఆశీర్వదించారు.
అక్కున చేర్చుకున్నారు..
మత్స్యకారుల జీవితాల్లోకి ఇన్నాళ్లూ ఏ నాయకుడూ తొంగి చూసిన పరిస్థితి లేదు. మత్స్యకారుల తోలు తీస్తాం.. ఫినిష్ చేస్తాం అని గత సీఎం బెదిరిస్తే, సాదరంగా అక్కున చేర్చుకుని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని ఇవాళ చూస్తున్నాం. ప్రతి హామీనీ నెరవేర్చిన సీఎం మన ముందున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా అందిస్తూ వలస వెళ్లకుండా తొమ్మిది హార్బర్లు మంజూరు చేసిన ప్రభుత్వమిది.
ఇప్పటికే నెల్లూరులో జువ్వలదిన్నె, బాపట్లలో నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడలో హార్బర్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు బియ్యపుతిప్ప హార్బర్ నిర్మాణం ప్రారంభమవుతోంది. కేంద్రం సహకారం అందించకుంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేద్దామని సీఎం చెప్పారు. ఆక్వా రంగంలో ఒడిదుడుకులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ మత్స్యకారుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది.
– సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి
మాట ప్రకారం..
పాదయాత్ర సమయంలో నరసాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. జిల్లా కేంద్రం చేయాలని కోరినప్పుడు నరసాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెడతామని సీఎం హామీ ఇచ్చారు.
మాట ప్రకారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టులకు నరసాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్
Comments
Please login to add a commentAdd a comment