Y.S. Sharmila
-
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల
సాక్షి, న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజుతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్టీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్‌కు సైతం ఖర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు. షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనగా మరి వేదికపైకి మీరెందుకు వచ్చారని ఖర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యున్నతికి పనిచేస్తా... కాంగ్రెస్‌లో చేరడంపట్ల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కల అని.. ఆ కల నెరవేర్చేందుకు, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తా నని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. -
ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘనస్వాగతం
గజ్వేల్ (మెదక్ జిల్లా) : వైఎస్సార్సీపీ నాయకురాలు వై.ఎస్.షర్మిలకు సోమవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, నినాదాలతో చౌరస్తా ప్రాంగణం హోరెత్తింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్రకు బయలుదేరిన సందర్భంగా మార్గమధ్యంలోని ప్రజ్ఞాపూర్‌లో కొద్దిసేపు ఆగిన షర్మిల చౌరస్తాలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాజన్న కూతుర్ని చూడటానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారు. చౌరస్తా వద్ద తన కోసం వేచి వున్న మహిళలను షర్మిల ఆత్మీయంగా పలకరించారు. అందరినీ 'బాగున్నారామ్మా...?' అంటూ అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. షర్మిలను చూస్తుంటే దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి వచ్చిన రోజులు గుర్తుకువస్తున్నాయని వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి రేణుక, పోతగల్ల పోశమ్మ, నర్సమ్మ తదితరులు 'సాక్షి'తో పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డిని చూసినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. పేదల కోసమే వైఎస్ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వారు కొనియడారు. తరలివచ్చిన జిల్లా నేతలు ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మెర వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాన్ని పూలతో అలంకరించారు. షర్మిల రాగానే వైఎస్ విగ్రహానికి పూలమాలుల వేసి కొద్దిసేపు ప్రార్ధించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న పరామర్శయాత్రకు తరలివెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్‌రావు, సాయికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నర్రా బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అజహర్, మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.