గజ్వేల్ (మెదక్ జిల్లా) : వైఎస్సార్‌సీపీ నాయకురాలు వై.ఎస్.షర్మిలకు సోమవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, నినాదాలతో చౌరస్తా ప్రాంగణం హోరెత్తింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్రకు బయలుదేరిన సందర్భంగా మార్గమధ్యంలోని ప్రజ్ఞాపూర్‌లో కొద్దిసేపు ఆగిన షర్మిల చౌరస్తాలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా రాజన్న కూతుర్ని చూడటానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారు. చౌరస్తా వద్ద తన కోసం వేచి వున్న మహిళలను షర్మిల ఆత్మీయంగా పలకరించారు. అందరినీ 'బాగున్నారామ్మా...?' అంటూ అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. షర్మిలను చూస్తుంటే దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి వచ్చిన రోజులు గుర్తుకువస్తున్నాయని వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి రేణుక, పోతగల్ల పోశమ్మ, నర్సమ్మ తదితరులు 'సాక్షి'తో పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డిని చూసినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. పేదల కోసమే వైఎస్ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వారు కొనియడారు.
తరలివచ్చిన జిల్లా నేతలు
ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మెర వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాన్ని పూలతో అలంకరించారు. షర్మిల రాగానే వైఎస్ విగ్రహానికి పూలమాలుల వేసి కొద్దిసేపు ప్రార్ధించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న పరామర్శయాత్రకు తరలివెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్‌రావు, సాయికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నర్రా బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అజహర్, మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘనస్వాగతం
Published Mon, Aug 24 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement