సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : హైదరాబాద్‌లో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా ఇంటికి వచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. ఇంటికి చేరిన మృతదేహాలను చూసి ఊరంతా బోరున విలపించింది.
హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్‌లో జరుగుతున్న ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంతోషంగా వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడం, నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ముగ్గురు ప్రముఖులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గ్రామస్తులు ఘోల్లుమన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్‌లో ఆదివారం ఓ సినిమాకు సంబంధించిన ఫ్రీ రీలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల మల్లేశం(47), టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్‌ఎంపీ జంగ ప్రభాకర్‌రెడ్డి(50), వేగురుపల్లి గ్రామపంచాయతీ ఐదో వార్డుసభ్యుడు అలుగువెల్లి జనార్ధ్దన్‌రెడ్డి(40), టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు నిట్టురు పుల్లయ్య(40), పెరుమాల్ల గోవర్ధన్(38), కోల శంకరయ్య(55), కారు డ్రైవర్ పబ్బతి దేవేందర్‌రెడ్డి(35)లు ఓకే గ్రామానికి చెందినవారు. కారు కిరాయికి మాట్లాడుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం కారులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా సుమారు 12 గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకుంట్ల మల్లేశం, జంగ ప్రభాకర్‌రెడ్డి, అలుగువెల్లి జనార్ధన్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వేగురుపల్లికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులరోదనలు మిన్నంటాయి.
కుటుంబానికి పెద్ద దిక్కు..
అలువెల్లి జనార్థన్‌రెడ్డి మృతితో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. మృతుడికి భార్య శైలజ, ఇంటర్ చదివే రుచిత, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
సాధారణ కుటుంబంలో పుట్టి..
కనుకుంట్ల మల్లేశం మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి రాజకీయంగా ఎది గాడు. నాడు అతడి భార్య స్వరూప సర్పంచ్ ప దవి అలంకరించి అనారోగ్యంతో మృతిచెందగా నేడు కోడలు సంగీత సర్పంచ్. మృతుడికి కూతురు సౌమ్య, కుమారుడు అభిలాష్, రెండో భార్య బుజ్జమ్మ ఉన్నారు.
సీనియర్ నాయకుడిగా..
మృతిచెందిన జంగ ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నాడు. ఇతడు మంత్రి ఈటలకు బంధువు, అత్యంత సన్నిహితుడు. మృతుడి భార్య వనజ ఉంది. ఇద్దకు కుమారులు కాగా ఒకరు వైద్య వృత్తిలో, మరొకరు సాప్ట్‌వేర్ ఇంజనీరుగా రాణిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆర్‌ఎంపీగా కొనసాగుతున్నారు.
మంత్రుల పరామర్శ
ప్రజ్ఞపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగురుపల్లికి చెందిన ముగ్గురు మృతిచెందగా, బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ మృతదేహాలకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు తదితరులు నివాళులర్పించారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి దిగ్భ్రాంతి..
వేగురుపల్లి గ్రామస్తులు ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ సానుభూతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
నివాళులర్పిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, తదితరులు
Comments
Please login to add a commentAdd a comment