Karimnagar Crime News
-
ఈ అక్షయ పాత్రతో నీళ్లు తాగితే పాము కాటు వేసిన ఏం కాదు!
సాక్షి, జగిత్యాలక్రైం: అక్షయపాత్ర కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్‌బజార్‌కు చెందిన రాయిల్ల సాయికుమార్‌ను సంప్రదించాడు. అతను హైదరాబాద్‌కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్కుమార్లను శ్రీనివాస్ వద్దకు తీసుకువచ్చాడు. మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని, ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ బుధవారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అక్షయపాత్ర స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తపై భార్య వేధింపులు
సాక్షి, మల్యాల(చొప్పదండి): భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్‌తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. ‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతోపాటు రాజేందర్ ఫోన్లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్‌తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గల్ఫ్ వెళ్లొచ్చినా తీరని పగ, మద్యం తాగుతుండగా..
సాక్షి, ఇబ్రహీంపట్నం(కోరుట్ల): పాతకక్షలతో వ్యక్తిని హత్య చేసిన దారుణ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటుచేసుకుంది. ఎర్దండిలో బర్లపాటి రాజేశ్వర్(42) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పల్లె పోశెట్టి బుధవారం రాత్రి కత్తితో పొడిచి చంపినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకుల వివరాల మేరకు...మృతుడు రాజేశ్వర్, పల్లె పోశెట్టిలకు 2017లో ఓ విషయంలో జరిగిన గొడవలో ఘర్షణకు పాల్పడగా రాజేశ్వర్‌పై కేసు నమోదైంది. అనంతరం రాజేశ్వర్ గల్ఫ్ వెళ్లి కొద్దిరోజులక్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు విషయమై పోశెట్టిని పలుసార్లు రాజీకి రావాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్‌షాపు వద్ద వీరిద్దరు మద్యం తాగుతుండగా మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. పోశెట్టి ఇంటికెళ్లి కత్తి వెంట తెచ్చుకొని రాజేశ్వర్ కడుపు, ముఖంపై పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా తండ్రికోసం వచ్చిన కూతురు దాడి దృశ్యాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు రాజేశ్వర్‌ను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు పల్లె పోశెట్టిపై గతంలో ఎడ్లను దొంగిలించినట్లు కేసు నమోదైందని గ్రామస్తులు తెలిపారు. కాగా పోశెట్టి భార్య పద్మ, తండ్రి నడ్పి రాజన్న, తల్లి రాజు, చెల్లెలి కొడుకు కాయిపల్లి రమేశ్ కలిసి తన భర్తను హత్యచేసినట్లు మృతుడి భార్య బర్లపాటి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గౌస్‌బాబా తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ధర్నా నిందితుడిని కఠినంగా శిక్షించాలని గురువారం ఎర్దండి గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మెట్పల్లి సీఐ శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చజెప్పినా వినకపోవడంతో డీఎస్పీ గౌస్‌బాబా వచ్చి సముదాయించారు. మృతుడు రాజేశ్వర్ ముగ్గురు కూతుర్లు డీఎస్పీ కాళ్లపై పడి బోరున విలపించారు. తమ తండ్రిని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. కాగా బెల్టుషాపులను మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ గౌస్‌బాబా మాట్లాడుతూ నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని, గ్రామానికి రాకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కోరుట్ల,మెట్పల్లి సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీనివాస్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్సైలు, పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
విద్యార్థినిపై లైంగిక దాడి.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేశాడు. పలుసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్, ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో విద్యార్థినికి దగ్గరయ్యాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వీడియో, ఫొటోలు తీసి తరచూ బెదిరిస్తూ పలుసార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయమై విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ బుధవారం యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ పరిసరాల్లోని గ్రామస్తులను ఈ ఘటనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందనే కొణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గంజాయి మత్తులో నిందితుడితో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్‌లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్‌తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్‌ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ -
రక్తమోడిన రామోజీపేట
సాక్షి, సిరిసిల్ల: దసరా పండుగ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో రక్తం చిందింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ఊరు రణరంగమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామోజీపేటలో ఇరువర్గాల మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒక వర్గం వారు డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా.. మరో వర్గం వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పరస్పర దాడులకు దిగారు. ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఏడుగురిని గాయపరిచారు. 9 ఇళ్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. 11 వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రామోజీపేటకు చేరుకుని బాధితులను, సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ సర్వర్లు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంవారు కర్రలతో మరో సామాజిక వర్గం వారిపై దాడి చేయడం ఆందోళన కలిగించింది. -
మద్యం మత్తు గొడవ హత్యకు దారితీసింది
సాక్షి, రామగుండం(కరీనంనగర్): గోదావరిఖని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం గ్రామానికి చెందిన చెన్నూరి మధుకర్(21) మేషన్ పని చేసుకుంటూ గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. లెనిన్‌నగర్‌కు చెందిన గద్దల వంశీ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. శుక్రవారం రాత్రి గాంధీనగర్ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే తోటి స్నేహితుడైన గడ్డం అరుణ్ అలియాస్ సోను ఇంటికి వెళ్లి మద్యం తాగారు. మద్యంమత్తులో వంశీ, మధుకర్ మధ్య మాటమాట పెరగడంతో మధుకర్‌పై విచక్షణారహితంగా తలపై బరువైన ఇనుప సుత్తిలాంటి వస్తువుతో గద్దల వంశీ దాడిచేసి బాదడంతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు. సదరు సింగరేణి క్వార్టర్లో నివాసముండే అరుణ్‌తోపాటు, నిందితుడు గద్దల వంశీ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వంశీ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
ఎన్పీడీసీఎల్లో అన్న పేరుతో తమ్ముడు ఉద్యోగం
సాక్షి, రామగుండం: గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రవీందర్ అనే వ్యక్తి తన సోదరుడు రామదాసు పేరు మీద 12 ఏళ్లుగా టీఎస్ఎన్పీడీసీఎల్లో ఉద్యోగంలో కొనసాగుతున్న విషయం విజిలెన్స్ విచారణలో తేలింది. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ వివరాల మేరకు..గాదె రామదాసు, గాదె రవీందర్ ఇద్దరు కవలలు. పన్నెండు సంవత్సరాలక్రితం గాదె రామదాసుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జూనియర్ లైన్మెన్గా ఉద్యోగంరాగా రవీందర్ ఉద్యోగంలో చేరాడు. పదోన్నతి పొందుతూ లైన్మెన్ వరకు చేరుకున్నాడు. గోదావరిఖని ఎన్పీడీసీఎల్ ఈ సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్టిఫికెట్లలో పేర్లుదిద్ది ఉద్యోగం చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానంరావడంతో ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం నిర్ధారణ కావడంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. మంథని డివిజనల్ ఇంజినీర్ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ∙ -
తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో
రామగిరి(మంథని): మూడురోజుల క్రితం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు మృతదేహం వ్యవసాయ బావిలో తేలిన సంఘటన రామగిరి మండలం బేగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల రామస్వామి– దుర్గమ్మకు నలుగురు కూతుళ్లు, కొడుకు సంతానం. చిన్న కూతురు రమ్య(21) డిగ్రీ చదువుతోంది. అయితే రమ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ తగ్గపోవడంతో ఆసుపత్రికి వెళ్దామని తల్లి దుర్గమ్మ చెప్పగా, తాను రానని గత శుక్రవారం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్లలో వెతికారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య ఆదివారం గ్రామ శివారులోని కుమ్మరికుంట సమీపంలో గల తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా బావి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. విషయం గ్రామంలో ప్రచారం కావడంతో రామస్వామి–దుర్గమ్మ సంఘటన స్థలానికి చేరుకుని తమ కూతురు మృతదేహామేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.(ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా.. ) రాయికల్‌లో.. రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు రజిత(40) ఆ దివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. వివరాలిలా ఉ న్నాయి.. రజిత చిన్నప్పటి నుంచి మూర్చవ్యాధి తో బాధపడుతోంది. వివాహమై కూతురు పుట్టగానే విడాకులయ్యాయి. ఈక్రమంలో అ నారోగ్యంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మలి సంధ్యలో మరణ శాసనం.. కారణాలేమిటో..?
కాయాకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకున్న ఇంటి పెద్దలు.. మలి వయసులో మనుమలు, మనువరాళ్లు, కొడుకులతో సుఖసంతోషాలతో ఉండాల్సిన వారు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబానికి శోకం మిగిల్చుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 రోజుల వ్యవధిలో దాదాపు 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా.. అనారోగ్యమా.. కుటుంబ కలహాలా.. కారణమేదైనా తమకుతామే మరణ శాసనం లిఖిస్తూ ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. సాక్షి, వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో వారం వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన సంగెపు మల్లారెడ్డి మే 21న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన జక్కుల దేవయ్య మే 25న నూకలమర్రి శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్లీ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అనారోగ్య కారణాలతో వృద్ధుడు మే 30న ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. అలాగే మే17న జగిత్యాల మండలం సంగంపల్లికి చెందిన దాసరి రాజమల్లు, కాల్వశ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెకు చెందిన వృద్ధురాలు మణెమ్మ క్రిమిసంహారకమందు తాగి, మే 18న వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన లస్మవ్వ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మే 19న జమ్మికుంట రూరల్ మండలం చింతలపల్లికి చెందిన పుల్లూరి పోచమ్మ, మే 24న ఎలిగేడు మండలం దూళికట్టకు చెందిన మచ్చ రాజమల్లయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 15రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. (రౌడీషీటర్ దారుణహత్య) కారణాలేమిటో..? వయోభారం, అనారోగ్యం, మలి వమపెలొ కుటుంబసభ్యులకు భారం కాకుండా తనువు చాలించాలనే ఆలోచనతో పలువురు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి నా అనే వాళ్లు లేకపోవడంతో ఇక తాము ఉండలేమనే మనోవేధన, భావనతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తుల నోట వినిపిస్తోంది. మలి సంధ్యలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఆయా గ్రామాల్లో తోటివారిని కలిచివేస్తోంది. (పెద్ద మనసు చాటుకున్న వెటోరి ) భరోసా కల్పిస్తే.. వృద్ధాప్యంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు మేమున్నామనే భరోసా కల్పిస్తే వారిలో మనోధైర్యం కలుగుతుంది. ఆస్తితగాదాలు, మనస్పర్థలు, ప్రేమానురాగాలు లాంటి కారణాలతో వృద్ధ వయస్సులో మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు దారి తీస్తున్నాయి. – జక్కని రాజు, సైకాలజిస్టు, కరీంనగర్ ఇతరులకు భారం కావొద్దనే.. వృద్ధాప్యంలో కొంత మంది తనవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగవద్దని ఆలోచిస్తు న్నారు. తను మరొకరి భారం కావద్దనే ఉద్దేశ్యంతో బలన్మరణాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న. మరొకరితో సేవలు చేయించుకోవడం ఇష్టం లేక కూడా కొంత మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నా అభిప్రాయం. – ఆనందరెడ్డి, వైద్యాధికారి, వేములవాడ -
భర్తను కాదని ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. చివరికి
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తను కాదని మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరికి వరకట్నం వేధింపులకు నిండు జీవితం బలైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం..సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన నలువాల నర్మద (22) అనే వివాహిత యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. గతంలో పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసింది. అంతలోనే భర్త, అత్త , బావలు వరకట్నం వేధింపులకు గురి చేయడంతో తల్లిగారింటికి వచ్చి ఉరి వేసుకుంది. (నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ) జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్‌ని నర్మద ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలలపాటు వీరిదాంపత్యం సాఫీగానే సాగింది. వరకట్న వేధింపులు నర్మదను కష్టాల్లోకి నెట్టాయి. భర్త శ్రీనివాస్‌తోపాటు, అత్త నలువాల లక్ష్మీ, బావ నలువాల అనిల్ రూ.2 లక్షలు తీసుకురావాలని వేధించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నర్మద కుటుంబసభ్యులకు చెప్పగా పెద్దల సమక్షంలో చర్చించి కాపురం సాఫీగా సాగేలా చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. మార్చిలో నాగునూర్ గ్రామంలో తల్లిగారింటికి రాగా శుక్రవారం భర్త శ్రీనివాస్ గ్రామానికి వచ్చి నర్మదను దూషించాడు. గ్రామస్తులంతా గమనిస్తుండగానే తిడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్మద ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీస్‌వాహనంలో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సారంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించారు. నర్మద భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీ, బావ అనిల్ ముగ్గురిపై మృతురాలి తల్లి అరికిల్ల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. (‘కబీర్ సింగ్’ చూసి.. అమ్మాయిలకు ఎర! ) అదృశ్యమై...చెట్టుకు ఉరేసుకొని.. సైదాపూర్(హుస్నాబాద్): ఐదురోజులక్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఐదురోజులకు చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో నల్లకుంటప్రాంతంలో శుక్రవారం సంఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ పోలీసులు, గ్రామస్తుల ప్రకారం..ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన చిక్కుల కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు చిక్కుల మొగిలి(35)కి పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఓ మహిళతో వివాహం జరిగింది. మొగిలి చిన్నప్పుడు 7వతరగతి అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఏడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో దొరికాడు. అప్పటినుంచి హైదరాబాద్–ఎగ్లాస్పూర్ వస్తూపోతుంటాడు. (యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి ) పదేళ్లక్రితం హైదరాబాద్ యువతితో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. మార్చిలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో ఎగ్లాస్పూర్ వచ్చారు. నెలక్రితం భార్య హైదరాబాద్ వెళ్లింది. మొగిలి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఇంటి వద్ద గుంట స్థలం ఇటీవలే విక్రయించిన తండ్రి కొమురయ్య అప్పులు తీర్చాడు. కాగా మొగిలి మద్యానికి బానిసై ఈ నెల 25న సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి రేకొండ వైపు వెళ్లాడు. మొగిలి కనిపించడం లేదని ఈ నెల 28న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఎగ్లాస్పూర్ గ్రామ శివారులోని నల్లకుంట ప్రాంతంలో గొర్రెల కాపరులు చెట్టుకు ఉరేసుకొని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. సైదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి పిల్లలు లేరు. -
ఆత్మహత్యనా.. ఇతర కారణమా..?
కరీంనగర్‌క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గబ్బిలాలపేటలో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి ఘటన కరీంనగర్ పట్టణంతోపాటు కొత్తపల్లి మండలం చింతకుంటలో విషాదం మిగిల్చింది. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్‌నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్‌నగర్‌కు పయనమైనట్లు సమాచారం. కుటుంబ నేపథ్యం... ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్‌నగర్‌కు వెళ్లడానికి కారణమైనట్లు సమాచారం. వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్‌లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్‌కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. 10న కరీంనగర్ నుంచి వెళ్లిన తర్వాత వీరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
పథకం ప్రకారం భర్తను చంపించిన భార్య..
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. పథకం ప్రకారమే మమత ఆమె ప్రియుడు సురేశ్‌తో తిరుపతిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్‌హౌజ్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద పని చేస్తున్న సురేశ్ యజమాని భార్య మమతపై కన్నేశాడు. అప్పటి నుంచి ఇద్దరు అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్‌తో కలిసి మమత పథకం రచించింది. ప్లాన్ ప్రకారం తిరుపతిని హతమార్చేందుకు సురేశ్ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను అర్ధరాత్రి బస్వాపూర్‌కు తీసుకెళ్లింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. హ త్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది. హత్యకేసును చేధించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.? త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీకు అర్థమవుతోందా...!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. ప్రాణాలు తీసే పొగ... ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు. ప్రకటనలు ఇస్తున్నా.. అంతే ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏటా పది లక్షల మంది మృత్యువాత... పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బహిరంగంగానే... యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. క్యాన్సర్‌కు కారణం పొగ సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం. ఆరోగ్యానికి మంచిదికాదు సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్ట్రబుల్లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని చుక్కేస్తే.. చిక్కులే కరీంనగర్‌క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 23 మంది లైసెన్స్‌లు రద్దు తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది. దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది. అవగాహన...కౌన్సెలింగ్‌లు.. మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ఆన్లైన్ ద్వారా కేసు నమోదు వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్మెంట్లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాహనదారుల భద్రతలో భాగంగా.. వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్‌ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. – విబి.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) మండల కేంద్రంలోని గర్ట్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఏడాది క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఆది మల్లేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా హాస్టల్లో ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా గదిలోనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు అనూష రాకపోవడంతో పక్కగదిలో ఉంటున్న మరో విద్యార్థిని వెళ్లి చూడగా కనిపించలేదు. వెంటనే హాస్టల్ యజమానికి చెప్పడంతో కిటికీ పగలగొట్టి చూడగా బాత్రూంలో కాళ్లు కనిపించాయి. జారిపడి ఉంటుందని భావించారు. బాత్రూంకు గడియ పెట్టడంతో వెంటిలేటర్ నుంచి చూడగా ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రూరల్ ఏసీపీ విజయసారధి, సీఐ మహేశ్‌గౌడ్, ఎల్ఎండీ ఎస్‌హెచ్‌వో నీతికపంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో ఉన్న అనూష భర్తను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్తింటి వేధింపులే కారణం! అనూష మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఏడాది క్రితం తమ కుమార్తెకు రూ.21 లక్షల కట్నం, బంగారం ఇచ్చి సాగనంపామని, సంవత్సరం గడవకముందే ఆడపడచు, అత్త వేధింపులు మొదలయ్యాయని, మరో రూ.పది లక్షలు అదనంగా వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అనూష మరిదికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అతడికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తున్నారని, నీవు కూడా అంత కట్నం తీసుకురావాలని అనూషను ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. ఏసీపీ, సిఐ, తహసీల్దార్ మృతురాలి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి జడ మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. మర్తనపేటలో విషాదం కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్‌కు తరలివెళ్లారు. -
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, కరీంనగర్: మృగాళ్లు రెచ్చిపోయారు.. అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులు ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడడం కరీంనగర్లో కలకలం సృష్టించింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తరలించగా.. ఈ అమానుష ఘటన గురువారం వెలుగుచూసింది. నిర్భయ, సమత కేసుల్లో నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక(9) ఆదర్శనగర్‌లో మూడో తరగతి చదువుతోంది. తండ్రి ఆటోడ్రైవర్ కాగా.. తల్లి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. బాలికకు జ్వరం రావడంతో ఇంటి వద్ద ఉంటోంది. వీరి ఇంటికి సమీపంలో ఉండే వినోస్(20) సోమవారం బాలికను ఆడుకుందామని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం రవితేజ(18), మరో బాలుడికి చెప్పాడు. ముగ్గురూ కలిసి మంగళ, బుధవారాల్లో పైశాచికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు సంబంధిత సాక్షులు, అక్కడి ప్రాంతంలో నివాసం ఉండే పలువురిని విచారించారు. మరికొందరిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. సంబంధిత సాక్ష్యాధారాలు, ఘటన జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సాక్షులను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితుల అరెస్టు చూపించనున్నట్లు సమాచారం. చాలా రోజుల నుంచి కన్నేసి... భవన నిర్మాణ పనులు చేసే యువకుడు వినోస్ చాలా రోజుల నుంచే బాలికపై కన్నేసినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో మూడు రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అభంశుభం తెలియని అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కరీంనగర్లో కలకలం రేపింది. పోలీసు కమిషనర్ విచారణ అంబేద్కర్‌నగర్‌లో గురువారం కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి పర్యటించి విచారణ జరిపారు. అత్యాచారం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు, కుటుంబ సభ్యులు కమిషనర్‌ను కోరారు. కాగా, బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో, అత్యాచార కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ విజ్ఞాన్‌రావు తెలిపారు. మహిళల ఆందోళన మద్యందుకాణాల వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని నిరసిస్తూ కరీంనగర్ అబ్కారీ డీసీ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు, బీజేపీ నాయకులు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదర్శనగర్బోర్డు వద్ద ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబుల ఆగడాలు మితివీురుతున్నాయని, మద్యం మత్తులోనే బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు. అనంతరం ఆదర్శనగర్‌లో ఉన్న మద్యం దుకాణంపై చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత ఆబ్కారీ టౌన్‌సీఐ తాతాజీకి వినతిపత్రం అందించారు. స్థానిక కార్పొరేటర్ కుర్ర తిరుపతి, కార్పొరేటర్లు జయశ్రీ, విజయ, నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అతి వేగం: ఇద్దరు యువకుల మృతి
సాక్షి, కరీంనగర్: అతి వేగం.. మద్యం మత్తు పాతికేళ్లు కూడా నిండని ఇద్దరిని బలిగొనగా.. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులో గురువారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుకనుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌కు చెందిన వివేక్‌చంద్ర(20), నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్కాలనీకి చెందిన వేముల ప్రణయ్‌కుమార్(25), మంచిర్యాలకు చెందిన అంకరి స్వరాజ్, బియ్యాల శివకేశవ మిత్రులు. హైదరాబాద్‌లో ఉంటున్న మరో మిత్రుడి పుట్టిన రోజు గురువారం ఉండటంతో వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరు గౌతమినగర్‌లోని వివేక్‌చంద్ర ఇంట్లో కలుసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ బయల్దేరాలనుకున్నారు. చాలారోజుల తర్వాత కలవడంతో వివేక్‌చంద్ర ఇంట్లోనే అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సేవించారు. అనంతరం కారులో బయల్దేరి ఉదయం వరకు హైదరాబాద్ చేరాలనుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతో స్వరాజ్ వేగంగా డ్రైవ్ చేశాడు. వివేక్‌చంద్ర, ప్రణయ్‌కుమార్, శివకేశవ నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున 3:30 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. మిత్రులంతా నిద్రలోకి జారుకోవడంతో స్వరాజ్ కూడా మద్యం మత్తు కారణంగా నిద్రను ఆపుకుంటూ కారు నడిపాడు. కరీంనగర్ నుంచి 20 నిమిషాల్లో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చేరుకున్నారు. రెప్పపాటులో.. కారు రామకృష్ణకాలనీ దాటుతుండగా డ్రైవ్ చేస్తున్న స్వరాజ్‌కు ఒక్కసారిగా లారీ కనిపించడంతో దానిని తప్పించబోయాడు. అప్పటికే 90 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు.. రెప్పపాటులో ఎడమవైపు భాగం లారీని వేగంగా ఢీకొంటూ దూసుకెళ్లి డివైడర్‌ను తాకి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు ముందుసీట్లో కూర్చున్న వివేక్‌చంద్ర, వెనుక సీట్లో కూర్చున్న ప్రయణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్వరాజ్, కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో లారీ కిందభాగంలో ఉన్న స్టెప్నీ టైర్ విరిగిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఇరుక్కుపోయిన మృతదేహాలు.. ప్రమాద సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మహేశ్‌గౌడ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఇంతలో çకరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ రావడంతో పోలీసులు దానిని ఆపి స్థానికుల సాయంతో అతికష్టంగా క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. ఇద్దరినీ అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు డ్రంకన్ డ్రైవ్.. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరాజ్, శివకేశవ పరిస్థితి మెరుగ్గా ఉందని సీపీ తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు వారికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా ఆల్కాహాల్ శాతం 87 వచ్చిందని తెలిపారు. ప్రమాదం గురించి క్షతగాత్రులను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారని, మద్యం మత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఎల్ఎండీ పోలీసులు పూర్తి విచారణ జరిపి నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చింది. సినిమాకు వెళ్లాస్తా నాన్న అని చెప్పి వెళ్లిన కొడుకు వివేక్‌చంద్ర మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. ఊరికి వెళ్తున్న అని చెప్పి వెళ్లిన భర్త ప్రణయ్‌కుమార్ తిరిగిరాడని తెలిసి గుండెలు అవిసేలా రోదించింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్‌కు చెందిన కాసారపు రమేష్‌రావు, అనిత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వివేక్‌చంద్ర (20). హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజిలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి సినిమాకు వెళ్తున్నానని చెప్పి రాత్రి 8గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి శవవయ్యాడు. ఊరెళ్లొస్తానని చెప్పి... శ్రీరాంపూర్ కాలనీకి చెందిన వేముల సారేందర్, లక్ష్మీ దంపతుల పెద్దకుమారుడు ప్రణయ్‌కుమార్. తండ్రి ఎస్సార్పీ 3 గనిలో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేసి కారుణ్య ఉద్యోగాల కింద ఆన్ఫిట్ కావడంతో ఆయన స్థానంలో ప్రణయ్‌కుమార్ మే, 2019లో ఉద్యోగంలో చేరాడు. జూలై 2019న పావనితో వివాహమైంది. భార్యతో కలిసి సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. బుధవారం రెండో షిఫ్ట్‌కు వెళ్లిన ప్రణయ్‌కుమార్ విధులు ముగిసిన అనంతరం రాత్రి 10:40లకు భార్యకు ఫోన్ చేసి తాను ఇంటికి రావడం లేదని, ఊరెళ్తున్నాని చెప్పాడు. డ్యూటీ డ్రెస్ మీదనే మంచిర్యాలకు వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు వివేక్ చంద్ర, స్వరాజ్, శివకేశవ్లతో కలిసి కారులో బయలుదేరాడు. మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు బోరునవిలవిుంచారు. పరామర్శ... ప్రణణ్కుమార్ మృతిచెందిన విషయం తెలుసుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నాయకులు ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కిషన్‌రావులు మృతునికి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణయ్ స్నేహితులు భరత్‌రెడ్డి, అన్వేశ్రెడ్డిలు వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. సినిమాకెళ్లి వస్తాడనుకున్నా నా కొడుకు ఎవరితోను పెద్దగా స్నేహం చేయడు. ఈ స్నేహితులు నాకు తెలియదు. సినిమాకు వెళ్లస్తానాని చెప్పి వెళ్లిండు. ఉదయం కరీంనగర్ నుంచి ఫోన్ అచ్చింది. రోడ్డు ప్రమాదంలో నీ కుమారుడు వివేక్‌చంద్ర ఉన్నాడని చెప్పడంతో నమ్మలేకపోయాను. ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు. సినిమాకు అని వెళ్లిన కొడుకు ఇలా తిరిగివస్తాడనుకోలేదని బోరున విలపించాడు. – వివేక్ చంద్ర తండ్రి రమేష్‌రావు, మంచిర్యాల -
తండ్రి మరణం తట్టుకోలేక..
రామగుండంక్రైం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమవారం జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో వసంతం మృతదేహాన్ని చెన్నూరుకు వాహనంలో తరలిస్తుండగా, కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే మృతుడి కూతురు సాయిప్రియ (32) వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కారుని డ్రైవర్ నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగిన సాయిప్రియ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హఠాత్తుగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె గల్లంతు కావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రివర్ పోలీసులు గమనించి తాడు సాయంతో ప్రయత్నించినా నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అప్పటికే ఆమె మునిగిపోయింది. రోధిస్తున్న కుటుంబసభ్యులు వసంతం మృతదేహంతో చెన్నూరు వెళ్లిపోయారు. గాలింపు చర్యలు గోదావరి నదిలోని నీటిలో దూకి గల్లంతైన సాయిప్రియ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శవంపైకి తేలితే తప్ప చేసేదేమి లేదని పేర్కొంటున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు. కా గా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా పనిచేస్తోంది. ఘటనపై గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పరిధిలోని అల్గునూర్‌లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు. కడసారిగా కన్నీటి వీడ్కోలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. అందరితో అత్మీయంగా... సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్‌కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్ లీవ్‌లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్ లీవ్పెట్టినట్లు మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆత్మహత్యేనని అనుమానం..? జనవరి 25 తేదీన సుల్తానాబాద్‌కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్‌గౌడ్– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు. బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్ కుక్కర్, సిలిండర్, బెడ్షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్లో నుంచి నర్సింగ్కు ఫోన్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్‌తో మాట్లాడిన చివరికాల్ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. పలువురి పరామర్శ.. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో ఆరుగురి మరణవార్త.. 24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. -
‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’
సాక్షి, నిజామాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లో కారు మునిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వినయశ్రీ.. నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రాక్టికల్స్ ఉన్నందున అల్వాల్ షిప్ట్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగివుండొచ్చని బంధువులు అంటున్నారు. అయితే తమ స్నేహితురాలు మరణించిందని తెలియడంతో ఆమె తోటి విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమతో ఎంతో స్నేహంగా ఉండే ఆప్తురాలు దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. (రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) చదువులో చురుగ్గా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే వినయశ్రీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె స్నేహితులు అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. ఆదివారం వినయశ్రీ పుట్టినరోజు కావడంతో మెసేజ్‌లు పంపించామని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ఉంటుందని అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని అన్నారు. అందరితో మంచిగానే ఉండేదని, ఆమెతో ఎటువంటి సమస్యలు ఉండేవి కాదని తెలిపారు. బర్త్‌డే విషెస్‌లకు సమాధానం ఇవ్వకపోతే తీర్థయాత్రలో బిజీగా ఉందేమో అనుకున్నాం గానీ, ఇంత బాధాకరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. చదువుతో పాటు అన్నిట్లోనూ ముందుండే వినయశ్రీ ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోందన్నారు. మరో 9 నెలల్లో చదువు పూర్తవుతుందనగా ఆమె ఇలా మృత్యువు బారిన పడటం నమ్మలేకపోతున్నామని వినయశ్రీ క్లాస్మేట్స్ పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లిందా, ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) -
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అంతు చిక్కని రాధిక హత్య కేసు
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో మూడు రోజుల విచారణలో ఏమీ తేలకపోవడంతో గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కరీంనగర్ చేరుకుంది. హైదరాబాద్ సీటీ పోలీసు విభాగం నుంచి క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం కరీంనగర్ పట్టణం విద్యాగనర్‌లోని రాధిక ఇంటికి వెళ్లి వివిధ కీలకమైన ఆధారాలు సేకరించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్ కిట్స్ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి అడిషినల్ డీసీపీ చంద్రమోహన్తోపాటు టూ టౌన్ సీఐ దేవారెడ్డిని రాధిక ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్వపరాలు వివరించిన తర్వాత క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. (మిస్టరీగా మారిన రాధిక హత్య..) ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆధారాలు... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ క్లూస్‌టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆధారాలు సేకరించారు. త్రీడీ క్రైంసీన్ ఫొటోగ్రఫీ, వీడీయోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం కడిగిన స్థలం, గతంలో ఇక్కడి క్లూస్‌టీం సేకరించిన ఆధారాల గురించి వివరంగా తెలుసుకొనిఅవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. నూతన టెక్నాలజీతో కావాల్సిన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. (హంతకుడు ఎవరు..?) ఆధారాలు సేకరిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రీఫైనల్ పరీక్ష రోజే హత్య..! రాధిక హత్య జరిగిన రోజే రెండో ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు 10వ తేదీ నుంచి వారాంతం వరకు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు పరీక్ష జరిగింది. కానీ ప్రీఫైనల్ పరీక్షలకు హాజరు కాలేదు. ఒక వేళ హాజరు కావాలనుకుంటే పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి 1గంటల మధ్య కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాధిక హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం దాదాపుగా మధ్యాహ్నమే జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ కళాశాలకు వెళ్లాలనుకుంటే సిద్దమమ్యేటప్పుడు హత్య గురై ఉంటుందా..? అంతకుముందే హత్యకు గురైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది. హంతకుడి జాడేది..? రాధిక హత్య కేసు విచారణ నాలుగవ రోజుకు చేరినప్పటికీ హంతకుడెవరో తెలియలేదు. గతంలో సేకరించిన ఆధారాలు, ఫోన్‌కాల్ డాటా, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం వంటివి చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫోరెన్సిక్ నిపుణులు కేసుకు కావాల్సిన ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టుల వచ్చాక కేసు ఛేదనకు కావాల్సిన ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడెవరనే విషయంపై ఇటు పోలీసుల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాక ఏమైనా ముందుకు సాగుతుందో చూడాల్సిందే. చదవండి : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య -
మిస్టరీగా మారిన రాధిక హత్య..
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా... ఎవరీ దారుణానికి ఒడిగట్టారనే విషయంలో స్పష్టత రావడం లేదు. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చినా, అదెవరనే దానిపై క్లారిటీ లేదు. ఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ, ఇంకా విచారణ పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ చివరి వరకు వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడెవరనే విషయం ఇంకా తెలియలేదు. ప్రేమ తిరస్కరణ నిజమేనా..? రాధిక హత్యకు ప్రేమ తిరస్కరణ కారణమనే కోణంలో పోలీసులు జరుపుతున్న విచారణలో కొత్త అంశాలేవీ వెలుగులోకి రావడం లేదని సమాచారం. అయితే అనుమానాలు మాత్రం చాలానే వ్యక్తమవుతున్నా, వాటిని నిరూపించే ఆధారాలు దొరకడం లేదని తెలిసింది. కాల్‌డేటా, యువతి తల్లిదంద్రులు, స్థానికులు మాటల ఆధారంగా నలుగురు అనుమానితులను అదపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ఇందులో ఓ యువకున్ని మంగళవారం వేకువజామున 2గంటలకు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుడు రాధికను ప్రేమించడం నిజమేనని ఒప్పుకొన్నప్పటికీ, హత్య చేయలేదనే చెబుతున్నట్లు సమాచారం. ఫోన్ కాల్స్‌లో రాధికతో ఎక్కువసార్లు మాట్లాడినది కూడా ఆ యువకుడేనని పోలీసుల విచారణలో తేలింది. రాధిక ఇంట్లో అద్దెకు ఉండి నాలుగు రోజలు క్రితం వెళ్లిపోయిన పోచమల్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాన్ని రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇంట్లో దొంగతనంపై అనుమానాలు రాధిక హత్య కోణాన్ని విచారిస్తున్న పోలీసులకు ఆ ఇంట్లో నెలకొన్న పరిస్థితులు కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాధికను గొంతుకోసి చంపిన ఆగంతకుడు బీరువాలోని మూడు తులాల బంగారాన్ని, నగదును దొంగిలించడం ఆ తరువాత బీరువాను మూసేసి, దానికి అడ్డుగా మంచం పెట్టి వెళ్లడం ఒకెత్తయితే... రాధికను హత్య చేసిన తరువాత ఆధారాలు దొరకకుండా శుభ్రం చేయడం అనుమానాలను రేకెత్తిస్తోంది. హత్య తరువాత అంత ఓపికగా పనులు చక్కబెట్టే పరిస్థితి ఇంటి గురించి తెలిసిన వారికే తప్ప వేరేవారికి సాధ్యం కాదనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు. హత్య జరిగిన వెంటనే కుటుంబసభ్యులు వ్యవహరించిన తీరుపై కూడా ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ రాధికను హత్య చేసిన సంఘటన స్థలాన్ని ఇంచార్జి సీపీ సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఇంటి పరిసరాలు, అక్కడ ఉన్న వీధి పరిసరాలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హత్య జరిగిన విషయాన్ని అనేక కోణాల్లో ఎనిమిది బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. సమత, హాజీపూర్ ఘటనల్లో లాగే రాధిక హత్య కేసును కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దృష్టి సారించిన డీజీపీ.. రాధిక హత్య ఉదంతంపై రాష్ట్ర డీజీపీ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఐజీతోపాటు పలువురు అధికారులు సైతం రాధిక కేసుపై దృష్టి పెట్టి పలు సూచనలు అందిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి ఎప్పటికప్పుడు కేసు విచారణ గురించి తీసుకోవాలి్సన చర్యల గురించి సూచనలు చేస్తున్నారు. తొందరగా కేసును విచారించి నిందితుడు ఎవరనే విషయాన్ని తేల్చడానికి పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. సీసీ పుటేజీల పరిశీలన.. హత్య జరిగిన విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలోని రాధిక ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానంగా సీసీ కెమెరాల ద్వారా నిందితుడికి సంబంధించిన ఏ విషయాలూ తెలియలేదని అర్థమవుతోంది. దీంతోపాటు అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు కాకుండా కొందరు ఇంటి యజమానులు స్వంతంగా పెట్టుకున్న సీసీ కెమెరాల డీవీఆర్‌లను సైతం స్వాధీన పర్చుకోవడంతోపాటు మరిన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. స్థానికులను పూర్తిస్థాయిలో విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. కాగా సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గుడి వద్ద ఉన్న కెమెరా ఒక్కటే ప్రస్తుతం పోలీసులకు ఆధారంగా మారింది. లైంగిక దాడి జరగలేదు.. కాగా, రాధిక హత్యకు సంబంధించి పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు సమాచారం. గొంతుకోయడం వల్లనే హత్య జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పూర్తయిన రాధిక అంత్యక్రియలు.. రాధిక అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం రాంనగర్ సమీపంలోని కురుమ కులస్తుల శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున బంధువులు, ప్రజలు రాధిక మృతదేహాన్ని చూడడానికి తరలివచ్చారు. వివిధ పార్టీల నాయకులు, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
తెల్లవారితే పెళ్లి చూపులు అంతలోనే..
జగిత్యాల, వెల్గటూరు/ధర్మపురి: తెల్లవారితే పెళ్లిచూపులు అంతలోనే రోడ్డు ప్రమాదంలో వచ్చిన మృత్యువు యువకుడిని కబలించిన సంఘటన విషాదం నింపింది. వెల్గటూరు మండలం కొత్తపెల్లి వద్ద స్టేట్ హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా కారు డ్రైవరు పొడేటి భాను (32) మృతిచెందాడు. పెట్టెం సంతోశ్, చిలుక ముక్కు అశ్విన్‌కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ధర్మపురి ఆలయ ఉద్యోగులు. ముగ్గురు కలిసి ఆదివారం సినిమా కోసమని కరీంనగర్ వెళ్లి ధర్మపురికి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి వాటర్‌ట్యాంకు వద్ద ఉన్న నీటిసంపును ఢీకొట్టి సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా ఢీకొని బోల్తాపడింది. దీంతో కారులోని ముగ్గురు ఎగిరి బయటపడ్డారు. కారు నడుపుతున్న భాను తలకు తీవ్రంగా గాయంకావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పెట్టెం సంతోశ్ ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నాడు. మరోవ్యక్తి చిలుక ముక్కు అశ్విన్ పూజారిగా పని చేస్తున్నారు. ప్రమాదంధాటికి విద్యుత్‌పోల్ విరిగిపోయి లెవన్ కేవీ వైర్లు తెగిపడ్డాయి. కరెంట్‌నిలిచిపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్నేహితులు, బంధువులు,పూజారులు, ఆలయ ఉద్యోగులు ధర్మపురి నుంచి పెద్దసంఖ్యలో , ఘటనాస్థలానికి తరలివచ్చారు. భాను మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భాను తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.