కుళ్లిన మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు , ప్రియాంక(ఫైల్)
చందుర్తి(వేములవాడ): దాదాపు నెలన్నర క్రితం అదృశ్యమైన యువతి చందుర్తి మండలం మల్యాల గ్రామశివారులోని వ్యవసాయబావిలో గురువారం శవమై కన్పించింది. పోలీసుల వివరాల ప్రకారం..చందుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుక ప్రియాంక(24) 2018 డిసెంబర్ 7న ఇంట్లోంచి వెళ్లిపోయింది. రెండ్రోజులైనా రాకపోవడంతో తండ్రి కృష్ణహరి డిసెంబర్ 13న పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. వేములవాడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న రాజుపై అనుమానం ఉందనడంతో అతడ్ని ఠాణాకు పిలిపించి విచారించారు. థైరాయిడ్ పరీక్షకు ఆస్పత్రికి వచిందని, అంతకన్నా.. తమకేమి తెలియదని చెప్పడంతో వదిలిపెట్టారు. ప్రియాంక్ సెల్‌ఫోన్ డాటా ఆధారంగా పలువురిని ప్రశ్నించారు.
వాసన వస్తోందని..
మల్యాల గ్రామానికి చెందిన పెద్దిగిరి గంగయ్యకు సమీప అటవీప్రాంతంలోని గుట్టల్లో వ్యవసాయ పొలం ఉంది. నీరందించేందుకు గురువారం బావివద్దకు వెళ్లాడు. కుళ్లిన వాసన రావడంతో అందులోకి చూడగా శవం కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి కుళ్లిన మృతదేహాన్ని బావిలోంచి వెలికితీసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రియాంక మృతదేహంగా గుర్తించారు. చందుర్తి సీఐ విజయ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక ఆధారంగా వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
పెళ్లి ఇష్టంలేకనేనా..?
వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్న యువకుడితో బైక్‌పై ప్రియాంక తిరిగేదని తండ్రి పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రియాంకకు కథలాపూర్ మండలంలోని తన మేనబావతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. డిసెంబర్ 12న పెళ్లి నిశ్చయానికి ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఇంట్లోంచి వెళ్లిపోయి శవంగా మారిందని తల్లిదండ్రులు రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment