పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కమలాకర్
కరీంనగర్‌రూరల్: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్ మండలం చేగుర్తిలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు, మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి గ్రామంలోకి రాకుండా యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిని నెట్టివేస్తూ ముందుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ రామాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం దుర్శేడ్‌లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రభాకర్‌ను కొందరు మహిళలు డబుల్‌బెడ్రూం ఇళ్లు, బతుకమ్మ చీరెలివ్వలేదని, ఇళ్లస్థలాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యే కమలాకర్‌ను నిలదీయాలని ప్రభాకర్ చెప్పారు. దీంతో మహిళలు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు దూరంగా తీసుకెళ్లారు.
అనంతరం నల్లగుంటపల్లిలో ప్రచారం ముగించుకుని చేగుర్తికి చేరుకున్న ప్రభాకర్‌ను టీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా బైఠాయించి అడ్డుకున్నారు. పొన్నం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను తొలగించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల లోపులాట మధ్యలోనే ప్రభాకర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
మరోసారి అడ్డుకుంటే ‘గంగుల’ ఇంటి మీదికే వెళ్తా: పొన్నం ప్రభాకర్
‘గంగుల కమలాకర్ దోస్తు దోస్తంటే ఇట్లా చేస్తుండు.. నలుగురిని పంపించి అడ్డుకుంటున్నారు.. బిడ్డా నీ పిసరు పిసరు ఎళ్లాలి. మళ్లోసారి అడ్డుకుంటే నీ ఇంటిమీదకే వస్తా.. ఓడిపోతావని భయం పట్టుకుందా.. తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు చాలదా’.. అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం మాజీ ఎమ్మెల్యే కమలాకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తండ్రికొడుకులు పోటీచేసే అవకాశముందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను వివరించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చ ల్మెడ లక్ష్మినర్సింహరావు, కార్యదర్శులు ఆమ ఆనంద్, శంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, నగర అధ్యక్షుడు కె.ఆగయ్య, బొమ్మకల్ ఎంపీటీసీ వెంగల్‌దాసు శ్రీనివాస్, ఈశ్వర్, మాజీ ప్రజాప్రతి నిధులు జువ్వాడి మారుతీరావు, బేతి సుధాకర్‌రెడ్డి, మోహన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పొన్నం సత్యం, టి.శ్రీనివాస్‌గౌడ్, దామోదర్‌రావు, గోపాల్, శ్రావణ్, రమేశ్ పాల్గొన్నారు.
అడ్డుకున్న వారిపై కేసు నమోదు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ మండలం చేగుర్తిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం జెండా పండుగ నిర్వహించారు. అయితే వీరి కార్యక్రమాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గాడ్ల లక్ష్మినారాయణ, చామనపల్లి రాజు, అవుల సంతోష్‌తో పాటు మరో నలుగురిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కమద్రి సంజీవ్‌కుమార్ కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంజీవ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఏ పార్టీ అయినా మరో పార్టీ వారిని అడ్డుకోవడం, ఆటంకపర్చడం, వారి కార్యక్రమయాలు నిర్వహించుకోకుండా ఇబ్బందులు గురి చేయరాదని అలాంటి వారిపై ఎన్నికల నిబందనల ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రశాంత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment