
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు.
ఈనెల 24వ తేదీన కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్‌తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment