సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్‌లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్‌లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్‌లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది.
(చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!)
గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్‌లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్‌లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్‌లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు.
ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment