alaganur
-
బిడ్డ పెళ్లికి సిద్ధమై... చావుకు ఎదురెళ్లారా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీడీఎస్ చదువుతున్న కూతురును హౌజ్ సర్జన్ చేయాలి... హైదరాబాద్‌లో స్థిరపడ్డ కుటుంబంలోకి కోడలుగా పంపాలి... మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేయాలి... కొడుకు జ్ఞాపకాల నుంచి మెల్లగా బయటపడాలి... దానధర్మాలు చేస్తూ జీవితం గడపాలి..’’ గత నెల 12న కాకతీయ కాలువలో కారుతో సహా జలసమాధి అయిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి ఆలోచనలు ఇవి. తన సన్నిహితులు, స్నేహితుల వద్ద ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కొడుకు మరణం గురించి తరచూ బాధపడే సత్యనారాయణరెడ్డి కూతురుకు పెళ్లి చేసి, శేషజీవితం ప్రశాంతంగా గడపాలని భావించాడు. కానీ చిన్న చిన్న కారణాలతో మానసిక వేదనకు గురైన సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా కారుతో కాకతీయ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. ముందుగా ప్రమాదం అని భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఆత్మహత్య అనే తేలగా, ఇటీవల ఫెస్టిసైడ్ దుకాణం, ఇంట్లో దొరికిన డైరీలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాము మరణిస్తే ఆస్తిని తిరుమల వేంకటేశ్వర స్వామికి చెందేలా చూడాలని రాసిన డైరీతోపాటు భక్తి, విశ్వాసాల పేరుతో ఆయన భార్య రాధ డైరీలు, పుస్తకాల్లో రాసిన రాతలు ఈ ఘటనను ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం కొడుకు మరణించగా, కోలుకోని కుటుంబం ఇప్పటికీ కుమిలిపోతూ ఆవేశంతో కూడిన నిర్ణయంతో అనంత లోకాలకు చేరినట్లు తెలుస్తోంది. దేవుని గదిలో ప్రతిరోజు కొడుకు ఫొటోకు పూజించే వీరు చివరికి కొడుకు చెంతకే పయనమై ప్రాణాలు వదిలారు. ఫ్లాట్‌లో పాలు పొంగించేందుకు కూతురును పిలిపించి.. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దంత వైద్య కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వినయశ్రీని తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, రాధ జనవరి 25న కరీంనగర్‌కు పిలిపించారు. అంతకుముందే జనవరి 21న మేడ్చల్ సమీపంలోని కొంపల్లిలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొన్నారు. 26న రిపబ్లిక్ డే రోజు పాలుపొంగించాల్సి ఉండడంతో ఆ రోజు ఉదయమే కూతురుతో కలిసి దంపతులు కారులో బయలుదేరి వెళ్లారు. కారులో వెళ్తుండగా, ప్రజ్ఞాపూర్ వద్ద పిల్లి అడ్డం రావడంతో రాధ తీవ్ర వేదనకు గురైనట్లు సమాచారం. కొడుకు మరణం తరువాత భక్తి విశ్వాసాలను అధికంగా పాటిస్తున్న రాధ ఇంట్లో పాలు పొంగించేందుకు వెళ్తుంటే పిల్లి అడ్డు రావడమేంటని తీవ్ర వేదనకు గురైంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కలుపుకున్న సత్యనారాయణరెడ్డి, రాధ పిల్లి ఎదురవడం గురించి కాబోయే అల్లునితో మాట్లాడినట్లు సమాచారం. వీరి బాధ చూసిన అతను సిద్దిపేటలోని ఓ సిద్ధాంతి వద్దకు పంపగా, ఆయన ఏ దోషం లేదని చెప్పడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత రాధ కారు నుంచి దిగి ఫ్లాట్‌లోకి వెళ్లకుండా రోదించడంతో సత్యనారాయణరెడ్డి తిరిగి కారును కరీంనగర్ తీసుకొచ్చాడు. చదవండి: పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి! ఆ రాత్రి ఏం నిర్ణయం జరిగిందో..? జనవరి 26న హైదరాబాద్ ఫ్లాట్‌లో పాలు పొంగించకుండా కరీంనగర్ వచ్చిన సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య రాధ, కూతురు వినయశ్రీ ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కొడుకు మరణం తరువాత మానసికంగా కుంగిపోయిన రాధ, సత్యనారాయణరెడ్డి కూతురుకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని భావించే పెళ్లి సంబంధం కూడా సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. పిల్లి ఎదురొచ్చిన ఘటనతో భార్య ఫ్లాట్ ముందు రోదించడం, కాబోయే అల్లుని కుటుంబం ఏమనుకుంటుందోనని భావించడం వంటి కారణాలతో తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 27న ఉదయం ఇంటి పనిమనిషితో టూర్‌కు, తెలిసిన వారికి యాత్రకు వెళ్తున్నట్లు చెప్పడం, కూతురు సైతం తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెప్పడం సందేహాలకు తావిచ్చింది. జనవరి 25న ప్రమాదవశాత్తూ కారు కాకతీయ కాలువలో పడి కొట్టుకుపోవడం పత్రికల్లో చదివిన సత్యనారాయణరెడ్డి అదే సంఘటనను ప్రేరణగా తీసుకొని బలవన్మరణానికి నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. చదవండి: వినయశ్రీ మృతి: స్నేహితుల ఆవేదన జనవరి 27న సాయంత్రం 3 గంటల సమయంలో షాపులో పనిచేసే నర్సింగ్‌తో మాట్లాడిన సత్యనారాయణరెడ్డి తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. 4.30 గంటలకు కాబోయే అల్లుడు ఫోన్ చేస్తే మూడు ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు విచారణలో తేలింది. చీకటి పడ్డ తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి కారులో ముగ్గురు హైదరాబాద్ వైపు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. చీకటి పడ్డ తరువాతే ప్లాన్ ప్రకారమే కారులో వెళ్లి కాకతీయ కాలువలోకి కారును తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఏదేమైనా... చిన్న చిన్న సంఘటనలతో తీసుకున్న తప్పుడు నిర్ణయం భావిభారత వైద్యురాలిని, ఓ ఇంటికి కోడలు కావలసిన యువతిని బలి తీసుకొంది. ఓ కుటుంబాన్ని జల సమాధి చేసింది. -
కరీంనగర్ యాక్సిడెంట్లో కొత్త ట్విస్ట్!
సాక్షి, కరీంనగర్ : అల్గునూర్ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి అయిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అది ప్రమాదం కాదని, ఆత్మహత్య అని భావిస్తున్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఓ ఆధారం లభించింది. ఈ కారు ప్రమాదంపై పోలీసులు మొదటినుంచి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్ షాపులో దొరికిన డైరీ వారి అనుమానాలకు ఊతమిస్తోంది. ఆ డైరీలో యాక్సిడెంట్‌కు ముందే తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలని సత్యనారాయణ రాసుకున్నారు. దీంతో ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ’( జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా! ) కాగా, కొన్ని నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కుమార్తె వినయశ్రీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 21రోజులకు వెలుగులోకి వచ్చింది. కాకతీయ కాలువలో గల్లంతైన మహిళకోసం వెతుకుతుండగా కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా వీరి శవాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. దీంతో మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు జరిపారు. ( సహస్ర కాదు వినయశ్రీ... ) చదవండి : ‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’ -
జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా!
సాక్షి, కరీంనగర్ : అల్గునూర్ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనలో బయటపడ్డ మృతదేహాలు పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె వినయశ్రీ (21)గా గుర్తించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లిందని అంటున్నారు. (చదవండి : కుటుంబం జలసమాధి..) అనుమానాలివే..! అల్గునూర్ కెనాల్లో పడ్డ కారు జనవరి 26న ఉదయం 11.06 నిముషాలకు రేణిగుంట టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు రికార్డయింది. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ వైపు వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఇక 26న హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన సత్యనారాయణ రెడ్డి కుటుంబం మరుసటిరోజు 27న సాయంత్రం కరీంనగర్ నుంచి కారులో ఎటు బయలుదేరారు అనేది అనుమానం. కూతురు వినయశ్రీ చదువు కోసం హైదరాబాద్‌లో 26న సత్యనారాయణరెడ్డి ఇల్లు చూసొచ్చినట్లయితే 27న సాయంత్రమే ఎందుకు బయలుదేరారు అనే అనుమానం వ్యక్తమవుతోంది. (చదవండి : రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) టూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి 27న సాయంత్రం కారులో బయలుదేరారని సత్యనారాయణరెడ్డి వద్ద పనిచేసే గుమస్తా నర్సింగ్ తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయ్యారా? సాయంత్రం పూట ప్రమాదానికి గురైతే ఆ రూట్లో రద్దీగా ఉండే వాహనదారులు, జనం చూడలేదా అనేది అనుమానం. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాలు నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’
సాక్షి, నిజామాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లో కారు మునిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వినయశ్రీ.. నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రాక్టికల్స్ ఉన్నందున అల్వాల్ షిప్ట్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగివుండొచ్చని బంధువులు అంటున్నారు. అయితే తమ స్నేహితురాలు మరణించిందని తెలియడంతో ఆమె తోటి విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమతో ఎంతో స్నేహంగా ఉండే ఆప్తురాలు దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. (రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) చదువులో చురుగ్గా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే వినయశ్రీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె స్నేహితులు అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. ఆదివారం వినయశ్రీ పుట్టినరోజు కావడంతో మెసేజ్‌లు పంపించామని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ఉంటుందని అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని అన్నారు. అందరితో మంచిగానే ఉండేదని, ఆమెతో ఎటువంటి సమస్యలు ఉండేవి కాదని తెలిపారు. బర్త్‌డే విషెస్‌లకు సమాధానం ఇవ్వకపోతే తీర్థయాత్రలో బిజీగా ఉందేమో అనుకున్నాం గానీ, ఇంత బాధాకరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. చదువుతో పాటు అన్నిట్లోనూ ముందుండే వినయశ్రీ ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోందన్నారు. మరో 9 నెలల్లో చదువు పూర్తవుతుందనగా ఆమె ఇలా మృత్యువు బారిన పడటం నమ్మలేకపోతున్నామని వినయశ్రీ క్లాస్మేట్స్ పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లిందా, ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) -
రాధ కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!
-
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి
-
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
సీఎస్సీ విలేజ్ లెవల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్‌లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్సీ హైదరాబాద్ ఇన్చార్జి మంజుల వీఎల్ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్‌ను ప్రారంభించారు. సీఎస్సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్‌రెడ్డి, జాప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
కుందూకి నీటి విడుదల
కోవెలకుంట్ల: కుందూనది పరీవాహక ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేసవికాలం ప్రారంభం కాకముందే నది ఒట్టిపోవడంతో డివిజన్లోని 30 గ్రామాల ప్రజలు నీటికోసం వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నదీ పరీవాహకంలో సుమారు 2వేల హెక్టార్లలో రైతులు వరి, మినుము, కొర్ర, తదితర పంటలు సాగుచేయగా.. పంట చేతికందే తరుణంలో నది ఎండిపోయి సాగునీటి కష్టాలు తలెత్తాయి. రైతులు, ప్రజల అభ్యర్థన మేరకు అలగనూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో కొంతమేర నీరు చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
మిడుతూరు: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ రామ్మూర్తి తెలిపారు. బుధవారం అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీ కెనాల్ లాకెన్స్లో నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ 2.965 సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2.41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈ సెల్వరాజ్ పాల్గొన్నారు.