సాక్షి, నిజామాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్‌లో కారు మునిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వినయశ్రీ.. నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రాక్టికల్స్ ఉన్నందున అల్వాల్ షిప్ట్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగివుండొచ్చని బంధువులు అంటున్నారు. అయితే తమ స్నేహితురాలు మరణించిందని తెలియడంతో ఆమె తోటి విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమతో ఎంతో స్నేహంగా ఉండే ఆప్తురాలు దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. (రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!)
చదువులో చురుగ్గా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే వినయశ్రీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె స్నేహితులు అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. ఆదివారం వినయశ్రీ పుట్టినరోజు కావడంతో మెసేజ్‌లు పంపించామని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ఉంటుందని అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని అన్నారు. అందరితో మంచిగానే ఉండేదని, ఆమెతో ఎటువంటి సమస్యలు ఉండేవి కాదని తెలిపారు. బర్త్‌డే విషెస్‌లకు సమాధానం ఇవ్వకపోతే తీర్థయాత్రలో బిజీగా ఉందేమో అనుకున్నాం గానీ, ఇంత బాధాకరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. చదువుతో పాటు అన్నిట్లోనూ ముందుండే వినయశ్రీ ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోందన్నారు. మరో 9 నెలల్లో చదువు పూర్తవుతుందనగా ఆమె ఇలా మృత్యువు బారిన పడటం నమ్మలేకపోతున్నామని వినయశ్రీ క్లాస్‌మేట్స్ పేర్కొన్నారు.
కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లిందా, ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!)
Comments
Please login to add a commentAdd a comment