సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు.
బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment