
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటరమణ, ఇన్‌సెట్‌లో మృతుడు కున్‌సోత్ సురేందర్ (ఫైల్)
సాక్షి, వేములవాడ: ప్రేమపాశానికి ఓ నిండు ప్రాణం బలైంది. యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆ ఇంటి పరిసరాల్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన దారుణ ఘటన రుద్రంగి మండలం మానాల శివారులోని హన్మాన్‌తండాలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులే యువకుడిని చంపారని ఆరోపిస్తూ.. అమ్మాయి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. గ్రామస్థుల క థనం ప్రకారం.. దెగావత్‌తండాకు చెందిన కున్‌సోత్ సురేందర్(19) హన్మాన్ తండాకు చెందిన యువతి(17)ని ప్రేమిస్తున్నాడు. ఆమె ఇంటికి శనివారం రాత్రి స్నేహితుడు పవన్‌తో కలిసి వెళ్లాడు. అప్పటి నుంచి సురేందర్ అదృశ్యమయ్యాడు. యువకుడి కోసం తల్లి బుజ్జి, సోదరులు, తండావాసులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సదరు యువతి కుటుంబసభ్యులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పొలంలో మృతదేహం..
హన్మాన్ తండా శివారులోని పొలంలో సోమవారం సురేందర్ మృతదేహం లభించింది. పొలానికి అమర్చిన కరెంటు తీగ తాకి మరణించినట్లుగా ఉంది. సురేందర్ ఒంటిపై గాయాలున్నాయి. సదరు యువతి ఇంటి సమీపంలో శవం లభించడంతో యువతి కుటుంబసభ్యులే సురేందర్‌ను చంపారని ఆరోపిస్తూ దెగావత్ తండా వాసులు ఆందోళనకు దిగారు. సురేందర్ తండ్రి గంగాధర్ గల్ఫ్‌లో ఉండగా సురేందర్ అదృశ్యమై తెలిసి సోమవారం గల్ఫ్ నుంచి వచ్చాడు. ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉండగా సురేందర్ చిన్నోడు. కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ పాశానికి యువకుడు బలి కావడం గిరిజన తండాల్లో విషాదం నింపింది.
అట్టుడికిన తండా..
సురేందర్ శవం లభించడంతో మానాల తండాలు అట్టుడికాయి. యువకుడి చావుకు అమ్మాయి కుటుంబసభ్యులే కారణమని వారి ఇంటిపై దాడికి యత్నించారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, సీఐలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌చౌదరి, ఐదుగురు ఎస్సైలు పోలీసు బలగాలతో చేరుకొని గిరిజనులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒక దశలో పోలీసు బలగాలను తోసుకొని వెళ్లి యువతి ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని «ధ్వంసం చేస్తున్న వారిని కట్టడి చేశారు.
యువతి ఇంటిపై దాడి చేస్తున్న మహిళలు
అనుమానాస్పద కేసు నమోదు..
సురేందర్ మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ హామీ ఇచ్చారు. సురేందర్‌ను ఎవరైనా హత్య చేశారా..? విద్యుత్ షాక్‌తో మరణించాడా విచారణలో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న గిరిజనులతో పోలీసుల సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment