నిందితుడిని అరెస్టు చూపిస్తున్న ఏసీపీ
జ్యోతినగర్(రామగుండం): ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే అనుమానంతో ప్రియురాలిని అంతం చేయాలని చూశాడు ప్రియుడు. ఇందుకు ఆమెపై కత్తితో దాడి చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. హత్యాయత్నానికి పాల్పడిన నస్పూరి శ్రీనివాస్(30)ను ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య అరెస్ట్ చేయగా.. వివరాలను గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ బి.స్వామి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆటోనగర్‌కు చెందిన యువతి, భీమునిపట్నంకు చెందిన నస్పూరి శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. 2013లో యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అయినా.. శ్రీనివాస్ యువతి వెంటపడ్డాడు.
ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు. అదే సమయంలో యువతిని అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈనెల 21న యువతి ఇంటికొచ్చిన శ్రీనివాస్.. మార్చి 10న వివాహం చేసుకుందామని చెప్పి.. రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం ఓపెన్‌కాస్ట్–4 ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. యువతిపై దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment