ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది.
ప్రాణాలు తీసే పొగ...
ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు.
ప్రకటనలు ఇస్తున్నా.. అంతే
ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఏటా పది లక్షల మంది మృత్యువాత...
పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
బహిరంగంగానే...
యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్‌లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
క్యాన్సర్‌కు కారణం పొగ
సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం.
ఆరోగ్యానికి మంచిదికాదు
సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్‌ట్రబుల్‌లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది.
– డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని
చుక్కేస్తే.. చిక్కులే
కరీంనగర్‌క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.
23 మంది లైసెన్స్‌లు రద్దు
తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది.
దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది.
అవగాహన...కౌన్సెలింగ్‌లు..
మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు.
ఆన్‌లైన్ ద్వారా కేసు నమోదు
వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్‌మెంట్‌లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్‌శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్‌లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
వాహనదారుల భద్రతలో భాగంగా..
వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్‌ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.
– విబి.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment