తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి. | Burning Cigarettes Can Lead To Many Health Problems | Sakshi
Sakshi News home page

తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.

Published Mon, Sep 30 2019 2:07 AM | Last Updated on Mon, Sep 30 2019 2:07 AM

Burning Cigarettes Can Lead To Many Health Problems - Sakshi

నా వయసు 42 ఏళ్లు. నేను చేసే పనిలో టార్గెట్‌లతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చిన్నప్పట్నుంచీ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. ఇప్పుడు నా వృత్తిలో బాగా ఒత్తిడి ఉండటం వల్ల సిగరెట్లు కాల్చడం కూడా ఎక్కువైంది. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతో సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. నాకు తగిన పరిష్కారం సూచించండి.

సిగరెట్లు కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాలుస్తున్నట్లు చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ప్రభావం తప్పక చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయజనమూ ఉండదు. సిగరెట్‌ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది.

టీబీ పూర్తిగా తగ్గుతుందా?

మా అమ్మ వయసు 58 ఏళ్లు. ఆమె గత ఆరేళ్లుగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ రక్తహీతన (అనీమియా)కు గురైంది. ఇటీవలే పరీక్షలు చేయిస్తే ఆమెకు టీబీ ఉన్నట్లు తెలిసింది. టీబీ పూర్తిగా నయమవుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి.

సరైన రీతిలో చికిత్స తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా, శాశ్వతంగా నయమవుతుంది. ఇది మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబర్క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల సంక్రమించే వ్యాధి. జ్వరం, దగ్గు వస్తూ తెమడపడుతుండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీకి ఐసోనియాజిడ్, రిఫామ్‌పిసిన్, పైరజినమైడ్, ఎథాంబుటాల్‌     అనే నాలుగు రకాల మందులను కాంబినేషన్స్‌లో ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ మందుల మోతాదును రోగి బరువును పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పూర్తి చికిత్స కోసం కనీసం ఆర్నెల్లు మందులు వాడాల్సి ఉంటుంది. మొదటి రెండు నెలలను ఇంటెన్సివ్‌ ఫేజ్‌ అంటారు. ఇందులో నాలుగు రకాల మందులనూ ఉపయోగిస్తారు. చివరి నాలుగు నెలలనూ కంటిన్యూయేషన్‌ ఫేజ్‌ అంటారు. ఇందులో మూడు మందులు వాడతారు. అవి...  ఐసోనియజిడ్, రిఫామ్‌పిసిన్, ఎథాంబుటాల్‌ అనే మందులు. టీబీ చికిత్సలో రోగి ఓపికగా పూర్తికాలం పాటు మందులు వాడి తీరాలి.

కొన్నాళ్ల తర్వాత లక్షణాలు తగ్గినట్లు కనపడగానే, తనకు వ్యాధి నయమైనట్లుగా భావించి, మందులను వదిలేస్తే వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే రోగి మందులు వాడుతూ క్రమం తప్పకుండా డాక్టర్‌ ఫాలో అప్‌లో ఉండాలి. చికిత్స సమయంలో రోగి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామందిలో ఆకలి తగ్గడం, తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగులు బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్ల వంటివి తీసుకోవడం వల్ల రోగులు మెరుగ్గా కోలుకుంటారు. డయబెటిస్‌ వ్యాధి కూడా టీబీతో బాధపడే రోగులను ప్రభావితం చేసే అంశమవుతుంది.

ఎందుకంటే చక్కెరను సక్రమంగా అదుపులో పెట్టుకోని రోగుల్లో వ్యాధి నయం కావడం అంత తేలిక కాదు. ఇక చివరగా టీబీ వచ్చిన రోగులకు తప్పనిసరిగా హెచ్‌ఐబీ స్క్రీనింగ్‌ పరీ చేయించాలి. ఎందుకంటే వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల చాలామందిలో టీబీ బయటపడుతుంది. వ్యాధి నిరోధకత తగ్గిందంటే అది హెచ్‌ఐవీ వల్లనా అనేది తెలుసుకొని, ఒకవేళ హెచ్‌ఐవీని కనుగొంటే దానికి కూడా చికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మగారి రక్తహీనత సమస్యకు వస్తే అది క్రమంగా ట్యాబ్లెట్లతో పరిష్కరించవచ్చు. ఒకవేళ ఆమెకు రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం అవసరం కావచ్చు.
డాక్టర్‌ జి. హరికిషన్,
సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ అండ్‌ చెస్ట్‌ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement