వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే
సాక్షి, సిరిసిల్ల: స్నేహితుల మధ్య దొర్లిన మాటల తప్పిదానికి తమ మిత్రుడినే హత్యచేసిన ఐదుగురిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడకు చెందిన కవిరాజు, నాగరాజు, అజయ్, కృష్ణ, నాగేష్, సాయి స్నేహితులు. వీరిలో సాయి పది రోజుల కిందట తన మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయి. వీరిలోని కవిరాజు తన మిత్రుడు సాయిపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తనొక్కడే చంపడం వీలు కాదని మిగతా స్నేహితులు నాగరాజు, అజయ్, కృష్ణ అలియాస్ కిట్టు, నాగేష్‌లకు విషయం చెప్పాడు. వారంతా అందుకు ఒప్పుకున్నారు.
అందరూ కలసి సంక్రాంతి పండగ రోజునే పూటుగా మద్యం తాగించి సాయిని మట్టుపెట్టాలని పథకం పన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు తమ స్నేహితుడు సాయిని పార్టీకి పిలిచి ఫుల్‌గా మద్యం తాగించారు. మరో ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి చింతల్‌ఠాణా – చీర్లవంచ గ్రామాల మధ్యలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకూ సాయిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టగా సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే కిట్టు తన షర్టు విప్పేసి సాయి మెడకు ఉరితాడులా బిగించి సాయి కొట్టుమిట్టాడుతుండగానే తమతో తెచ్చుకున్న బ్లేడుతో ఒకరితర్వాత ఒక్కరు గొంతు దగ్గర కిరాతకంగా కోసేశారు.
చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడినుంచి హైదరాబాద్‌కు పారిపోయారు. వెంట తీసుకెళ్లిన డబ్బులు ఖర్చు అయిపోగా వేములవాడ తిరుగుపయనంలో ఆదివారం ఉదయం టెక్స్‌టైల్ పార్కు వద్ద తాము పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిందితుల్లో ఒకరైన గౌరవేని నాగరాజుపై ఇప్పటికే పోక్సోతో సహా మూడు కేసులు ఉన్నాయని ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment