Friends murder
-
దారుణం: రూ.400 తిరిగి ఇవ్వాలని కోరితే
సాక్షి, చెన్నై: తన వద్ద తీసుకున్న రూ.400ను తిరిగి ఇవ్వాలని అడిగిన యువకుడిని స్నేహితులే హత్య చేశారు. ఈ ఘటన సోమవారం పొంగలూర్ సమీపంలో జరిగింది. కెరుడముత్తూర్‌కి చెందిన తంగరాజ్ కుమారుడు నందకుమార్ (24) కూలి పనులు చేస్తుంటాడు. అదే ఊరికి చెందిన ఇతని స్నేహితులు విజయ్ (22), సుధాకర్ (20). నందకుమార్ వద్ద సుధాకర్ రూ. 400 అప్పు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ముగ్గురూ ఊరి సమీపంలో మద్యం సేవించడానికి వెళ్లారు. ఆ సమయంలో నందకుమార్ తాను ఇచ్చిన రూ. 400లను అడిగాడు. ఈ క్రమంలో తగాదా ఏర్పడింది. ఆగ్రహించిన సుధాకర్, విజయ్ నందకుమార్‌పై దాడి చేశారు. రాయిపై పడడంతో నందకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కామనాయక్కన్ పాలైయమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
స్నేహితుడినే మట్టుపెట్టిన మిత్రులు
సాక్షి, సిరిసిల్ల: స్నేహితుల మధ్య దొర్లిన మాటల తప్పిదానికి తమ మిత్రుడినే హత్యచేసిన ఐదుగురిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడకు చెందిన కవిరాజు, నాగరాజు, అజయ్, కృష్ణ, నాగేష్, సాయి స్నేహితులు. వీరిలో సాయి పది రోజుల కిందట తన మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయి. వీరిలోని కవిరాజు తన మిత్రుడు సాయిపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తనొక్కడే చంపడం వీలు కాదని మిగతా స్నేహితులు నాగరాజు, అజయ్, కృష్ణ అలియాస్ కిట్టు, నాగేష్‌లకు విషయం చెప్పాడు. వారంతా అందుకు ఒప్పుకున్నారు. అందరూ కలసి సంక్రాంతి పండగ రోజునే పూటుగా మద్యం తాగించి సాయిని మట్టుపెట్టాలని పథకం పన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు తమ స్నేహితుడు సాయిని పార్టీకి పిలిచి ఫుల్‌గా మద్యం తాగించారు. మరో ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి చింతల్‌ఠాణా – చీర్లవంచ గ్రామాల మధ్యలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకూ సాయిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టగా సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే కిట్టు తన షర్టు విప్పేసి సాయి మెడకు ఉరితాడులా బిగించి సాయి కొట్టుమిట్టాడుతుండగానే తమతో తెచ్చుకున్న బ్లేడుతో ఒకరితర్వాత ఒక్కరు గొంతు దగ్గర కిరాతకంగా కోసేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడినుంచి హైదరాబాద్‌కు పారిపోయారు. వెంట తీసుకెళ్లిన డబ్బులు ఖర్చు అయిపోగా వేములవాడ తిరుగుపయనంలో ఆదివారం ఉదయం టెక్స్టైల్ పార్కు వద్ద తాము పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిందితుల్లో ఒకరైన గౌరవేని నాగరాజుపై ఇప్పటికే పోక్సోతో సహా మూడు కేసులు ఉన్నాయని ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, తదితరులు ఉన్నారు. -
తాగిన మైకంలో స్నేహితుడి హత్య
సిరిసిల్ల: తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్నేహితుడినే కొట్టి చంపిన సంఘటన సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. సంజీవయ్యనగర్‌కు చెందిన నీరటి అరుణ్‌కుమార్(28) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. అరుణ్‌కుమార్‌ను తోటి స్నేహితుడు కొంపెల్లి విజయ్‌కుమార్(32) కొట్టి చంపారు. మంగళవారం ఉదయం అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌లు సిరిసిల్ల నుంచి బోయినపల్లి మండలం వర్దవెల్లికి వెళ్లారు. అరుణ్‌కుమార్ నానమ్మ పింఛన్ విషయమై మాట్లాడి, మధ్యమానేరు పరిహారం గురించి ఊరిలో చర్చించారు. అక్కడే ఇద్దరూ మద్యం తాగి సిరిసిల్లకు చేరుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మళ్లీ రెండోసారి మద్యం తాగి కల్లు తాగేందుకు అంబికానగర్‌లోని కల్లు కంపౌండ్‌కు వెళ్లారు. అక్కడ కల్లు తాగుతున్న క్రమంలో అరుణ్‌కుమార్ సెల్‌ఫోన్ పోయింది. సెల్‌ఫోన్ ఏమైందని కల్లుతాగుతున్న వారిని అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌లు తనిఖీ చేశారు. ఫోన్ జాడ తెలియక పోవడంతో అరుణ్‌కుమార్ కోపంతో ఊగిపోయారు. ఈ క్రమంలో స్నేహితులైన అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌ల మధ్య ఘర్షణ జరిగింది. కల్లు దుకాణం నిర్వాహకులు ఇద్దరిని బయటికి పంపించడంతో రాజీవ్‌నగర్ వెళ్లిన ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలో అరుణ్‌కుమార్ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేసి నిందితుడు విజయ్‌కుమార్‌ను శనివారం అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. గతంలోనూ విజయ్‌కుమార్‌పై పోలీసు కేసులున్నాయని సీఐ వివరించారు. తాగిన మైకంలోనే విచక్షణ కోల్పోయి అరుణ్‌కుమార్‌ను విజయ్‌కుమార్ హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.