గల్ఫ్‌ వెళ్లొచ్చినా తీరని పగ, మద్యం తాగుతుండగా.. | Man Assassinate In Jagitial Over Old Clashes | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ వెళ్లొచ్చినా తీరని పగ, మద్యం తాగుతుండగా..

Published Fri, Feb 26 2021 10:03 AM | Last Updated on Fri, Feb 26 2021 10:55 AM

Man Assassinate In Jagitial Over Old Clashes - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం(కోరుట్ల): పాతకక్షలతో వ్యక్తిని హత్య చేసిన దారుణ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటుచేసుకుంది. ఎర్దండిలో బర్లపాటి రాజేశ్వర్‌(42) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పల్లె పోశెట్టి బుధవారం రాత్రి కత్తితో పొడిచి చంపినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకుల వివరాల మేరకు...మృతుడు రాజేశ్వర్, పల్లె పోశెట్టిలకు 2017లో ఓ విషయంలో జరిగిన గొడవలో ఘర్షణకు పాల్పడగా రాజేశ్వర్‌పై కేసు నమోదైంది. అనంతరం రాజేశ్వర్‌ గల్ఫ్‌ వెళ్లి కొద్దిరోజులక్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు విషయమై పోశెట్టిని పలుసార్లు రాజీకి రావాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్‌షాపు వద్ద వీరిద్దరు మద్యం తాగుతుండగా మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది.

పోశెట్టి ఇంటికెళ్లి కత్తి వెంట తెచ్చుకొని రాజేశ్వర్‌ కడుపు, ముఖంపై పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా తండ్రికోసం వచ్చిన కూతురు దాడి దృశ్యాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు రాజేశ్వర్‌ను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు పల్లె పోశెట్టిపై గతంలో ఎడ్లను దొంగిలించినట్లు కేసు నమోదైందని గ్రామస్తులు తెలిపారు. కాగా పోశెట్టి భార్య పద్మ, తండ్రి నడ్పి రాజన్న, తల్లి రాజు, చెల్లెలి కొడుకు కాయిపల్లి రమేశ్‌ కలిసి తన భర్తను హత్యచేసినట్లు మృతుడి భార్య బర్లపాటి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గౌస్‌బాబా తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

నిందితుడిని కఠినంగా  శిక్షించాలని గ్రామస్తుల ధర్నా
నిందితుడిని కఠినంగా శిక్షించాలని గురువారం ఎర్దండి గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మెట్‌పల్లి సీఐ శ్రీనివాస్‌ గ్రామస్తులకు నచ్చజెప్పినా వినకపోవడంతో డీఎస్పీ గౌస్‌బాబా వచ్చి సముదాయించారు. మృతుడు రాజేశ్వర్‌ ముగ్గురు కూతుర్లు డీఎస్పీ కాళ్లపై పడి బోరున విలపించారు. తమ తండ్రిని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. కాగా బెల్టుషాపులను మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. డీఎస్పీ గౌస్‌బాబా మాట్లాడుతూ నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని, గ్రామానికి రాకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కోరుట్ల,మెట్‌పల్లి సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీనివాస్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్సైలు, పోలీసులు బందోబస్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న గ్రామస్తులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement