రంజిత్ మృతదేహం
సాక్షి, ధర్మపురి: ట్రిపుల్ రైడింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో యువకుడి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బీర్‌పూర్ మండలం కండ్లపల్లికి చెందిన నారపాక రంజిత్(19), విష్ణువర్ధన్, పూడూరి సిద్దు ధర్మపురి మండలం గాదెపల్లికి బయలుదేరారు. గాదెపెల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కెనాల్‌లో నీరు ఉండడంతో తీవ్రంగా గాయపడ్డ రంజిత్ నీటిలో మునిగి మృతిచెందాడు. విష్ణువర్ధన్, సిద్దును స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బైక్‌ను విష్ణువర్ధన్ నడిపిస్తున్నాడని ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడి తండ్రి దుబ్బయ్య గతంలో చనిపోయాడు. చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న కొడుకు మృతిచెందడంతో తల్లి గంగవ్వ రోదనలకు అంతులేకుండా పోయింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రంజిత్ కుటుంబంలో విషాదం
సారంగాపూర్(జగిత్యాల): ఆసరాగా నిలుస్తాడనుకున్న ఎదిగొచ్చిన కొడుకు అకాల మృతితో రంజిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏడాదిన్నర క్రితం భర్త చనిపోగా.. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. మండలంలోని కండ్లపల్లికి చెందిన నారపాక రంజిత్(19) సోమవారం ధర్మపురి మండలంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రంజిత్ తండ్రి దుబ్బయ్య ఏడాదిన్నర క్రితం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతిచెందాడు. తల్లి గంగమ్మ కూలి పనిచేసుకొని రంజిత్, అతని తమ్ముడు హన్సిత్‌ను సాదుకుంటుంది. రంజిత్ ప్రస్తుతం బీర్‌పూర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ బ్యాండ్‌మేళంలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. చెట్టంతా కొడుకు మరణవార్త విని తల్లి గంగమ్మ కుప్పకూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment