రోదిస్తున్న కుటుంబసభ్యులు, రాజశేఖర్ మృతదేహం
ధర్మపురి: పొలానికి నీరందించేందుకు వెళ్లిన దొనకంటి రాజశేఖర్(23) ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన ధర్మపురి మండలం నక్కలపేటలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నక్కలపేటకు చెందిన దొన కంటి రాజశేఖర్ డిగ్రీ చదివాడు. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. సోమవారం జరిగిన సర్పంచు ఎన్నికల్లో తొలిసారి ఓటువేశాడు.
మంగళవారం ఉదయం తండ్రి లస్మయ్యతో కలిసి గ్రామ సమీపంలోని తమ పొలానికి నీరందించేందుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి విద్యుత్‌సరఫరా లేకపోవడంతో తండ్రి లస్మయ్య ఇంటికి వెళ్లాడు. రాజశేఖర్ అక్కడే ఉన్నాడు. కాసేపటికి విద్యుత్ వచ్చిందో.. రాలేదో చూద్దామని వ్యవసాయమోటారు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. పరిశీలిస్తుండగా కాలుజారి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. కాసేపటికి సమీప బంధువైన రాకేశ్ అక్కడికి చేరుకున్నాడు.
బావిలోకి చూడగా రాజశేఖర్ చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేశాడు. పొలం వద్దకు వెళ్లాడని మృతుడి తల్లిదండ్రులు చెప్పడంతో రాకేశ్ చుట్టుపక్కలా వెతికాడు. ఎక్కడా కానరాకపోవడంతో స్నేహితుల సాయంతో వ్యవసాయబావిలో వెతికారు. అప్పటికే రాజశేఖర్ నీళ్లుమింగి చనిపోయాడు. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. రాజశేఖర్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకుని కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తండ్రి లస్మయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment