ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వైఎస్ షర్మిల
సాక్షి, న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజుతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్‌టీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్‌కు సైతం ఖర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు.
షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనగా మరి వేదికపైకి మీరెందుకు వచ్చారని ఖర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అభ్యున్నతికి పనిచేస్తా...
కాంగ్రెస్‌లో చేరడంపట్ల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కల అని.. ఆ కల నెరవేర్చేందుకు, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తా నని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు.
కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment