జనాభిమానం
అభిమానం పెల్లుబికింది. ఆప్యాయత ఉప్పొంగింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జననేత ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ రోడ్‌షో జగన్నినాదంతో మార్మోగింది.
సాక్షి, ఒంగోలు, అద్దంకి జనం అదరగొట్టారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డులో జనగర్జన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు భారీ స్పందన లభించింది.
ఐదు మండలాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లబండ్లు, బస్సులు పెట్టుకుని మరీ స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు ఒకటీ..రెండు కాదు, ఏకబిగిన ఎనిమిది గంటల పాటు జగన్ కోసం నిలువెల్లా కనులై ఎదురుచూశారు. మిహ ళలు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు.. రైతులు, రైతు కూలీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు.
పార్టీ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోడ్‌షో ఉదయం 12 గంటలకు జరగాల్సి ఉండగా... సాయంత్రం ఆరు గంటలకు జగన్ ప్రచారరథం అక్కడకు చేరింది. ఉదయం 10 గంటల నుంచే అద్దంకి నియోజకవర్గ గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని ఒక్కొక్కరుగా చేరుకున్నారు.
వాహనాలకు పార్టీ జెండాలు పెట్టుకుని, తలలకు జెండాలతో పాగాలు చుట్టుకుని సంతమాగులూరు అడ్డరోడ్డులో సందడి చేశారు. గ్రామాల నుంచి వచ్చేప్పుడు భోజనం క్యారేజీలు సైతం తెచ్చుకుని.. పండగ తిరునాళ్లలో దేవుని దర్శనం కోసం వేచిఉండే చందంగా వాతావరణం కనిపించింది.
హైవే జంక్షన్ జామ్ చేసిన జనాభిమానం..
నాయకుడిని ఎంచుకుని..అతన్నే ఎన్నుకోవడానికి అభిమాని ఎన్నికష్టాలైనా ఓరుస్తాడనేది బుధవారం జగన్ రోడ్‌షోకు గంటల తరబడి వేచిఉన్న జనాన్ని చూస్తే నిరూపితమైంది. అద్దంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి కలిసివచ్చి ఉదయం 11 గంటలకు సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద కనిపించగానే..
సామాన్య మధ్యతరగతి జనం వారిని అప్యాయంగా పలకరించారు. అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, జె.పంగులూరు, సంతమాగులూరు మండలాలతో పాటు పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు మండల జనం కూడా బృందాలుగా వచ్చి జగన్ రోడ్‌షోను విజయవంతం చేశారు.
పదేళ్లపాటు అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా గొడవలకు తావులేకుండా.. ప్రశాంతంగా అభివృద్ధి జరగడమే ...ఇంతటి ప్రజాదరణకు కారణమని అక్కడకొచ్చిన జనం చెప్పడం విశేషం.
- చిన్నారులు వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని ఎండకు మండుతున్న హైవేరోడ్డుపై తల్లులతో కలిసి చిరునవ్వులు చిందించడం రాజకీయ పరిశీలకులకే ఆశ్చర్యాన్ని కలిగించింది.
- పాతమాగులూరుకు చెందిన పేరం వీరమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు జగన్ వచ్చేదాకా తాను ఇంటికెళ్లనంటూ.. తనకు పింఛన్ రావడం లేదని చెబుతానంటూ వేచి ఉంది.
- మిన్నేకల్లు గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు కూడా ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న సద్దిమూటను స్థానిక పెట్రోలు బంకు వద్ద కూర్చొని తింటూ.. జగన్‌ను చూసిన తర్వాతే ఇంటికెళ్తానని చిరునవ్వుతో చెప్పాడు.
బైక్ ర్యాలీలతో జనభేరికి ఘనస్వాగతం..
గుంటూరు జిల్లా వినుకొండలో బహిరంగ సభ ముగించుకుని బయల్దేరిన జగన్‌కు ప్రకాశం జిల్లా సరిహద్దులోని వెల్లలచెరువు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాపట్ల లోక్‌సభ, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ అమృతపాణి, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాగర్లమూడి రాఘవరావు, డాక్టర్ బాచినేని చెంచుగరటయ్య, ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్‌చైర్మన్ కోయి అంకారావు, అద్దంకి పట్టణ పార్టీ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి.
మండల కన్వీనర్లు జ్యోతి హనుమంతరావు, జజ్జర ఆనందరావు, మలినేని గోవిందరావు, స్వయంపు హనుమంతరావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, కరి పరమేష్, జిల్లాఎస్సీసెల్ నాయకుడు రంపతోటి సాంబయ్య, సంతమాగులూరు నేతలు ఓరుగంటి కోటిరెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి.
యమహా రాజు, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌లతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. యువత వంటికి వైఎస్ఆర్ సీపీ జెండాలు చుట్టుకుని, రంగులు పూసుకుని బైక్‌లపై రకరకాల విన్యాసాలు చేయడం ఉత్సాహం కలిగించింది.