ముద్రణాలయ ఉద్యోగి దుర్మరణం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: నగరంలోని వెంకట రమణ కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ప్రమాదంలో కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగి వై. సూర్యప్రకాశ్(47) మరణించారు. ముద్రణాలయంలో బైండర్‌గా పని చేస్తున్న ఇతడు టీఎన్టీయూసీ యూనియన్‌కు అడ్వయిజరుగా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీలోని కంసలివీధిలో నివాసం ఉంటున్న ఈయనకు భార్య శారద, కూతుళ్లు ప్రియాంక (ఇంటర్), సాయి (9వ తరగతి) ఉన్నారు.
స్నేహితుని పిల్లల పెళ్లి సంబంధం కోసం గురువారం తెల్లవారుజామున ఫోర్జ్ ఐకాన్ కారులో హైదరాబాద్ వెళ్లిన ఈయన అక్కడ పని ముగించుకుని మరో ముగ్గురితో కలిసి రాత్రి కర్నూలు బయలుదేరారు. ఓ ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకుంటుండగా వీరి కారు ప్రమాదవశాత్తు వెంకటరమణకాలనీలోని ఏపీజీబీ బ్యాంక్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో సూర్యప్రకాశ్ మరణించగా కారులో ఉన్న సురేంద్రారెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖుల సంతాపం..
ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, ముద్రణాలయ డీజీఎం వీరేశ్‌బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.విజయకుమార్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బి.ఎ.కె.పర్వేజ్ , ఆయా కార్మిక సంఘాల నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సహోద్యోగులు అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు.