ఎంసెట్‌కు అంతా ఓకే
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్,అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం ఎంసెట్-2014 నిర్వహిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణకు ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని 10 ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 10,862 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ కోర్సుకు 8,745 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు 2,117 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు 10 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 3 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
పరీక్షకు గంట ముందు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తరువాత నిముషం ఆలస్యమైనా ఎవరినీ అనుమతించేది లేదని ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జెడ్.రమేష్‌బాబు తెలిపారు.
= విద్యార్థుల సీటింగ్ ఎరేంజ్‌మెంట్‌కు సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థులకు వేరు వేరు రంగుల్లో ప్రత్యేకంగా స్టిక్కర్లను సరఫరా చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలుపు రంగు స్టిక్కర్లలో వారి హాల్‌టికెట్ నంబర్, నలుపు రంగు స్టిక్కర్లో అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లను సరఫరా చేశారు. వారికి కేటాయించిన స్థానాల్లో ఈ స్టిక్కర్లను అంటించారు.
కాపీయింగ్‌కు పాల్పడితే
కఠిన చర్యలు:
అడ్డదారుల్లో ర్యాంకులు సాధించేందుకు ఎవరైనా హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడితే క్రిమినల్ కేసులు పెడతామని రమేష్‌బాబు హెచ్చరించారు. కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డవారు జైలుకు వెళ్లాల్సిందేనని, వారికి బెయిలు కూడా రాదని చెప్పారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల విషయంలో రాష్ట్ర గవర్నర్ అమల్లోకి తెచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎంసెట్‌లో అక్రమాలకు పాల్పడిన వారు శిక్షార్హులవుతారన్నారు.
విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదు. విద్యార్థులు ఉపయోగించే పెన్నులు, ఇయర్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను లోదుస్తుల్లో దాచి తెచ్చినా, పట్టుబడతారని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ పనిచేయకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు కూడా ఏర్పాటు చేసినట్లు రమేష్‌బాబు తెలిపారు. కాపీయింగ్‌ను నిరోధించేందుకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. రె వెన్యూ, విద్యాశాఖ, పోలీసులతో ఈ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ సమాధానాలను ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసేందుకు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కులధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారులతో అటెస్ట్ చేయించి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేయాలి.