Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Attacks on Sakshi offices across the state1
AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి

నాణేనికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి.. ‘సాక్షి’పై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి.. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదూడపై ఆవురావురుమంటూ విరుచుకు­పడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చమూకలు విరుచుకుపడ్డాయి.. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి, బోర్డులను విరగ్గొట్టి, పేపర్లను తగులబెట్టి వికృతానాందాన్ని ఆస్వాదించాయి. ప్రజల వాణిగా.. వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా.. నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్ల పైకెక్కడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.. వాటిని సాక్షికి ఆపాదించవద్దని కోరింది. అయినా దీనిని ఓ అవకాశంగా మార్చుకోవాలన్న దుగ్ధతో, రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగించిన ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామిక­వాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ఏడాదైనా ఒక్కటీ నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్‌ పాలి‘ట్రిక్స్‌’ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది. తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. ‘సాక్షి’ యూనిట్‌ కార్యాలయాల వద్ద నేమ్‌ బోర్డులను పెకిలించేశారు. ‘సాక్షి’ పత్రిక ప్రతులతో పాటు, ‘సాక్షి’ నేమ్‌ బోర్డులను తగులబెట్టారు. బయటి వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధంలేదని ‘సాక్షి’ చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ, ‘సాక్షి’ సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. విజయవాడలో ‘సాక్షి’ ఏపీ ప్రధాన కార్యాలయంపై దాడిఈ దాడుల్లో భాగంగా.. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైనా పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు భార్య అనురాధ, ఆయన కొడుకు గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, అల్లరిమూకలు ఉ.11 గంటలకు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని గేటు ముందు బైఠాయించారు. ‘సాక్షి’ పత్రికకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా, కొందరు అత్యుత్సాహంతో కార్యాలయం గేటుపైకెక్కి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం చేయాలని శతధా ప్రయత్నించారు. అది సాధ్యంకాక గుడ్లు, రాళ్లు తెచ్చి కార్యాలయంపైకి విసిరారు. దీంతో అక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవి తగిలాయి. మహిళా పోలీసులపై కోడిగుడ్లు పడ్డాయి. అప్పటికీ శాంతించని కూటమి నేతలు ‘సాక్షి’ నేమ్‌ బోర్డును తొలగించి, కొంత భాగాన్ని మురుగుకాలువలో పడేశారు. మిగతా భాగాన్ని గేటు ముందుకు తెచ్చి కాళ్లతో తొక్కారు. పత్రిక ప్రతులతో పాటు నేమ్‌ బోర్డుకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. ఆ సమయంలో విధుల్లోకి వెళ్లాల్సిన ‘సాక్షి’ సిబ్బంది రోడ్డుపైనే మండుటెండలో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. కూటమి నేతల దుశ్చర్యలకు ఆటోనగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో టీడీపీ నాయకులు సోమవారం పోలీస్‌ చట్టం సెక్షన్‌–30ని ఉల్లంఘించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎల్లోగ్యాంగ్‌ అరాచకం ఇలా..» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ‘సాక్షి’ కార్యాలయం ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు బావ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు సుమారు మూడు గంటలపాటు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కార్యాలయం నేమ్‌ బోర్డును పీకేసి తగలబెట్టారు. కార్యాలయంలోకి, ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి కార్యాలయం లోపల గలాటా సృష్టించారు. గేటుకున్న తాళాన్ని సైతం పీకేశారు. కార్యాలయం ఎదుట రెండు టెంట్లు వేసి ధర్నా చేశారు. » విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ‘సాక్షి’ యూనిట్‌ కార్యాలయాల వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించారు. » ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు యత్నించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రభస సృష్టించారు. » గుంటూరు జిల్లా ఆత్మకూరులోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ పేరుతో అమరావతి రైతులు, మహిళలు ధర్నా చేశారు. పలుమార్లు సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేట్లు ఎక్కి రాళ్లు రువ్వారు. రాజధాని జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్, మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ జవ్వాది కిరణ్, తాడికొండ మార్కెట్‌ యార్డ్‌ మాజీచైర్మన్, టీడీపీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, తాడేపల్లి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు అన్నె కుసుమ, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట సాక్షి కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. » నెల్లూరు, కర్నూలు, కడప, రేణిగుంటలోని సాక్షి యూనిట్‌ కార్యాలయాలపైనా టీడీపీ మూకలు కొందరు రౌడీలతో కలిసి దాడికి తెగబడ్డాయి.

Attack On Husband And Wife In Tadepalli2
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!

తాడేపల్లి రూరల్‌ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్‌ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్‌ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

YS Jagan mohan Reddy fires on cm Chandrababu Naidu3
అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస­రావును ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. ‘ఎక్స్‌’ వేదికగా కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోస్టు చేశారు. అనని మాటలను సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక పథకం ప్రకారం సాక్షి యూనిట్‌ కార్యాలయాలపైన దాడులు చేయించారని ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోందని వైఎస్‌ జగన్‌ దునుమాడారు. ఇంకా ఈ పోస్టులో ఆయన ఏం తెలిపారంటే..» ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాదిగా తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టుచేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.» సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? కొందరు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడంలేదా?» ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేనివాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014–19 మధ్య ఆ ఛానల్‌పై (గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.» చంద్రబాబూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలపై ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.» చంద్రబాబూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్‌మెయిల్‌ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్‌ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్‌ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.» చంద్రబాబూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఎంతోకాలం చెల్లవు చంద్రబాబూ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indian student At US airport Video Viral4
Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి

వాషింగ్టన్‌: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్‌ సర్కార్‌ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్‌ జైన్‌ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్‌ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్‌యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్‌ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్‌ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి.

Tragic incident in anantapur5
కంటనీరులే నింపకమ్మా.. సొమ్మసిల్లకే కూనలమ్మా!

నాన్న చనిపోయాడు. అమ్మకు మానసిక వైకల్యం. నా అనే దిక్కులేదు. అమ్మకొచ్చే పెన్షన్‌తో బతుకీడుస్తూ, కష్టాల మధ్యే చదువుకుంటున్న తొమ్మిదో తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకుని మరీ నెలలు తరబడి కీచకపర్వం సాగింది. ఇప్పుడా బాలిక జీవితం అగమ్యగోచరంగా మారింది.పద్నాలుగు మంది కామాంధుల కర్కశానికి బలైన ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైన దళిత మైనర్‌ బాలిక 8 నెలల గర్భంతో అనంతపు­రంలోని సర్వజనాసుపత్రి­లో బేలచూపులతో మౌనంగా రోదిస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురంవెలుగులోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి?ఈ దారుణాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదోనని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరు ఊరంతా టీడీపీ వర్గం కావడం.. ఏదైనా బయటకు చెబితే ప్రమాదం ఉండటంతో బాలిక ఎక్కడా నోరెత్తలేక­పోయింది. కరుణ చూపాల్సిన పెద్దమనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్‌ చేయించాలని నిందితులను తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడుగడు­గునా అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టొద్దని గట్టిగానే చెప్పారు. అప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు.బాధితురాలి పరిస్థితి దయనీయంబాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్‌ 6.3 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. సాధారణ మహిళకు 10 శాతంపైనే ఉండాలి. గర్భిణికి 11.5కు పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలికకు కేవలం 6.3 శాతం ఉండటంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో అత్యా­చా­రా­నికి గురై ఆస్పత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది.బా­లికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వె­ళ్లారు. ఇప్పుడేమో వా­ర్డు­లో అందరిలాగే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. కాన్పు­కు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటే­నే ద­యనీయంగా ఉంది. కనీసం ప్రత్యే­క వై­ద్య పరీక్షలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.సఖి సెంటర్‌కు తరలించాలన్న పోలీసులురామగిరి సీఐ ఆస్పత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖి సెంటర్‌కు తరలించాలని అడిగినట్టు తెలిసింది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్యసేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖి సెంటర్‌కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆస్పత్రికి అయితే రోజూ వందల మంది వస్తుంటారు. మీడియా ప్రతినిధులూ వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచార విషయంపై రోజూ చర్చ జరుగుతుందన్న కారణంగా పోలీసులు బాధితురాలిని సఖి సెంటర్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అంధకారంలో బాలిక భవిష్యత్‌ బాధితురాలి భవిష్యత్‌ అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అబార్షన్‌ చేసి తీసేయలేమని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లీ బిడ్డ ఎ­లా బతకాలి? ఆ ఊర్లో ఉండగలరా? నిందితులకు శిక్ష ప­డ్డా­క ఈ అమ్మాయిని ఆ ఊర్లోకి టీడీపీ నేతలు రాని­స్తా­రా? ఒకవేళ పోలీసు బందోబస్తు మధ్య అమ్మాయి ఊర్లోకి వెళ్లినా ఆమెను బతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్న ప్రశ్నలు. పరామర్శ లేదు.. ప్రభుత్వ సాయమూ లేదు ఈ అభాగ్యురాలి విషయం వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు దాటినా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలే­దు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాలిని పరామర్శించిన పాపాన పోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం.. ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండటం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల్లోనే మూడు హత్యలు జరిగాయి. ఒక అత్యాచారమూ జరిగింది. వీట­న్నిటిలోనూ సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు.

India rise to become the fourth largest economy is undoubtedly a notable achievement6
జీడీపీ వృద్ధి కథనం వెనుక...

హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అందమైన సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాలకి ఎనిమిది కిలోమీ టర్ల ఆవల... అల్పాదాయ వర్గాలు నివసించే ఓ ప్రాంతం. అక్కడ ఓ ఇరుకింట్లో నివసించే 21 ఏళ్ల మానస తెల్లారక ముందే నిద్ర లేచి పనికి బయలుదేరుతుంది. ఓ కార్పొరేట్‌ కార్యాలయ హౌస్‌ కీపింగ్‌ విభాగంలో నెల మొత్తం పని చేస్తే ఆమెకు లభించే వేతనం రూ. 8,500. తల్లి ఐదు ఇళ్లల్లో పనులుచేస్తుంది.తండ్రి తెలంగాణలోని ఓ పల్లెలో సన్నకారు రైతు ఒకప్పుడు. ఇప్పుడు భవన నిర్మాణ కూలీ. ఆ పని కూడా అన్ని రోజుల్లోనూ దొరకని పరిస్థితి. మానస వాళ్ల ఇంటికి కొన్ని వీధుల ఆవల, నగర పెరుగుదలను ప్రతిఫలించే హోర్డింగులు మెరిసిపోతుంటాయి. సేవా రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వెలిగించిన సాఫ్ట్‌ వేర్‌ సిటీగా హైదరాబాద్‌ కొనియాడబడుతుంటుంది. కానీ మానస వాళ్ల ఇంట్లో ఈ ఆర్థిక వృద్ధి తాలూకూ వెలుగు రేఖలెక్కడా కనిపించవు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా భారత్‌ మరో మైలు రాయిని చేరుకోవడం, జపాన్‌ను అధిగమించనుండటం గురించి పత్రికలు పలు కథనాలు ప్రచురిస్తున్నాయి. భారత్‌ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గుర్తించదగిన విజయమే. కానీ, విమర్శనాత్మక దృష్టికోణంలో పరిశీలించినట్టయితే ఇది ప్రశంసించదగిన విజయమని చెప్పలేం. జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయే తప్ప సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, మానవాభివృద్ధిని కొలవలేవు. అవి ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తుల గురించి చెబుతాయే తప్ప, వాటి ద్వారా ఎవరు లబ్ధిపొందుతున్నారనే కీలక విషయాన్ని పట్టించుకోవు. రెండు భారత గాథలుపరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ, 125 దేశాలతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ స్థానం దిగువనే, 111వ స్థానంలో ఉంది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ప్రకారం, ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 35 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 19 కోట్లకు పైగా భారతీయుల్లో పోషకాహార లోపముంది. ఆర్థిక వృద్ధి కూడా చాలామటుకు పట్టణ, సేవారంగ ఆధారితమైంది. 45 శాతం మంది భారతీయులకు వ్యవసాయం ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, జీడీపీలో వ్యవసాయ రంగ వాటా కేవలం 15 శాతమే.ఓవైపు జీడీపీలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు ఉద్యోగ రాహిత్యం తాండవిస్తోంది. ఉన్న ఉద్యోగాలకు సైతం భద్రత లేని పరిస్థితి. లేబర్‌ ఫోర్స్‌ డేటా ప్రకారం... అసంఘటిత, అభద్రమైన ఉద్యోగాల వైపు మళ్లించబడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దేశంలో 80–90 శాతం మంది అసంఘటిత కార్మికులే/ఉద్యోగులే.ఆదాయ, సంపదల పరంగా ఇప్పుడు ఏర్పడిన అసమానతలు స్వాతంత్య్రానికి ముందరి వలస కాలపు స్థాయితో పోటీ పడు తున్నాయి. వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ ప్రకారం... గత పాతికేళ్లలో ఆదాయ అసమానతలు పెరుగుతూ వచ్చాయి. 40 శాతం దేశసంపద ఒక్క శాతం దేశ కుబేరుల గుప్పిట్లో ఉంది. దిగువ భాగపు50 శాతం ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 3 శాతమే. ఓవైపు స్టాక్‌ మార్కెట్లు, శత కోటీశ్వరులు పెరుగుతుంటే, మరోవైపు లక్షలాదిమంది పేదరికం వైపు నెట్టివేయబడుతున్నారు. గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు, కింది కులాల వాళ్లు ఆర్థిక అస్థిరత తాలూకూ భారం మోస్తున్నారు. వృద్ధి రేటు పెరుగుదలపై వెలువడు తున్న విజయగాథల్లో... ఈ అసమానతల పార్శ్వం అరుదుగానే వినిపిస్తోంది.ఇక విద్యారంగ పరిస్థితికొస్తే... సర్కారీ బడుల్లో చేరికలు పెరిగినప్పటికీ 5వ తరగతిలోపు విద్యార్థుల్లో సగానికి పైగా పిల్లలు 2వ తరగతి పుస్తకం కూడా సరిగా చదవలేకపోతున్నారు. విద్యఅందుబాటులోకి రావడం ఎంత ముఖ్యమో, నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయం ఇక్కడ గ్రహించాల్సి వుంది. ఉపాధ్యాయులకు అరకొర జీతాలు చెల్లిస్తుండటం, బట్టీ పట్టించే బోధనా పద్ధతులు అవలంబిస్తుండటం వంటి అంశాలు నాణ్యతా రాహిత్యానికి కారణ మవుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు... కోవిడ్‌ అనంతర కాలంలో అభ్యసన సంబంధిత అంతరాల్ని మరింత పెంచాయి. కీలక సూచికల పట్ల పట్టింపు ఏదీ?ఇష్టపూర్వకమైన సూచికల ఆవల అంతగా పట్టించుకోని, లోతైన వ్యవస్థాగత ప్రమాదాలు పొంచి వున్నాయి. వాతావరణ సంక్షోభం, ప్రాంతీయ అసమానతలు వంటి కొన్ని కీలక సూచికలను ఏ మాత్రమూ లక్ష్యపెట్టలేదు. ఉదాహరణకు– భూగర్భ జల సంక్షోభ తీవ్రత ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ఒకటి. కానీ ఈసంక్షోభం వల్ల తలెత్తగల పర్యావరణ క్షీణతను జీడీపీ వృద్ధి గణకులు పరిగణనలోకి తీసుకోలేదు.మానవాభివృద్ధి పరంగా కేరళ, తమిళనాడు పై ర్యాంకుల్లో వున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఆరోగ్యం, అక్షరాస్యత అంశాల్లో దశాబ్దాలుగా వెనకబడి పోయాయి. సుమారు 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో... తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. అసమానతల తీవ్రతను పట్టి చూపే ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా ఇవ్వొచ్చు. పోషకాహారం, విద్య, వస్తు సేవల లభ్యత, వాతావరణ స్థితిస్థాపకత తరహా సూచికల్ని మెరుగు పరచుకునే దిశగా సాగాల్సిన లోతైన సంభాషణకు... జీడీపీ గణాంకాల పట్ల ఉన్న వ్యామోహం అడ్డుపడుతోంది. మనకు కావలసింది వృద్ధిఫలాలు మెరుగైన రీతిలో పునఃపంపిణీ కావడం. ప్రజారోగ్యంపై పెట్టుబడులు, ప్రా«థమిక విద్య, పోషకా హార కార్యక్రమాలు, ఉపాధికి హామీలు వంటి వాటి ద్వారా భారత దేశ దీర్ఘకాల భవిష్యత్తుకు దోహదం చేయడం. మరో విధంగా చెప్పాలంటే... విజయాన్ని పునర్నిర్వచించడం.మానస కుటుంబం తన మౌలిక అవసరాల విషయంలోఎలాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోనప్పుడు... ఆమె గౌరవ ప్రదమైన ఉద్యోగం, న్యాయమైన అవకాశాలు పొందగలిగి నప్పుడు... అది, అదే అసలైన వృద్ధి కథనం. అప్పటివరకు జీడీపీ గురించిన కథనాల్లో ఉండేవి పాక్షిక సత్యాలే.-వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ, ఏపీ-డా‘‘ బొడ్డు సృజన

Rasi Phalalu: Daily Horoscope On 10-06-2025 In Telugu7
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.10.47 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: అనూరాధ సా.5.48 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.11.53 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: ఉ.6.16 నుండి 8.02 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.వృషభం: కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కర్కాటకం: కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి.సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఉద్యోగ యత్నాలు అనుకూలం. సంఘంలో గౌరవం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.వృశ్చికం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి,వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.కుంభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.మీనం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులకు అవకాశం. ఇంటాబయటా చికాకులు.

Tension in Manipur after CBI arrests Kanan Singh8
నివురుగప్పిన నిప్పు

తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో! కొద్దివారాలుగా మణిపుర్‌ కొంత ప్రశాంతంగా ఉందని భ్రమిస్తున్నంత సేపు పట్టలేదు... ఆ రాష్ట్రం మరోసారి భగ్గుమంది. గత రెండేళ్ళుగా జాతి ఘర్షణల మధ్య చిక్కుకొని విలవిలలాడుతున్న ఈశాన్య రాష్ట్రం మళ్ళీ పతాక శీర్షికలకు ఎక్కింది. 2023 అల్లర్ల వేళ అనేక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న మైతేయ్‌ల ర్యాడికల్‌ సంస్థ ‘అరంబై తెంగోల్‌’ (ఏటీ) నేత కనాన్‌ సింగ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడంతో ఆదివారం ఉద్రిక్తత పెచ్చరిల్లింది. భగ్గుమన్న నిరసనల మధ్య రాష్ట్రంలో పలుచోట్ల కర్ఫ్యూ, అయిదు రోజుల పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించాల్సి వచ్చింది. వివిధ పార్టీల ఎమ్మెల్యేలు 23 మంది ఆదివారం వెళ్ళి, గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించి, సామరస్యపూర్వక పరిష్కారానికై అర్థించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వెరసి, కేంద్రం సుదీర్ఘ జాప్యం తర్వాత ఫిబ్రవరిలో ఎట్టకేలకు అసమర్థ బీరేన్‌ సింగ్‌ సర్కార్‌ను తప్పించి రాష్ట్రపతి పాలన విధించిందన్న మాటే గానీ, మణిపుర్‌ను యథాపూర్వ స్థితికి తీసుకురాలేకపోయింది. తాజా పరిణామాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. మైతేయ్‌లకు ఎస్టీ హోదాను ఇవ్వడాన్ని కుకీ వర్గ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించడం రెండేళ్ళ క్రితం జాతుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆర్థిక ప్రయోజనాలు, భూయాజమాన్యంపై అసలే దీర్ఘకాలంగా రెండు వర్గాల మధ్య నెలకొన్న అసంతృప్తి ఆ తాజా పరిణామంతో మరింత చిచ్చు రేపింది. అలా 2023 మే 3 నుంచి రాష్ట్రం అక్షరాలా తగలబడుతూనే ఉంది. ఈ ఘర్షణల వల్ల 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. బీరేన్‌ సింగ్‌ సారథ్యంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల రీత్యా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, పక్షపాతధోరణితో వ్యవహరించినట్టు ఆది నుంచీ ఆరోపణలున్నాయి. చివరకు భద్రతా దళాలు సైతం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్టు వార్తలొచ్చిన∙సంగతి మర్చిపోలేం. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, బీరేన్‌ను మార్చడానికి ఇష్టపడని బీజేపీ అధిష్ఠానం తీరా గత ఫిబ్రవరిలో ఆయనను పక్కకు తప్పించినా పుణ్యకాలం గడిచిపోయింది. 2022 ఫిబ్రవరి నాటి ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మద్దతు కూడగట్టుకొని అధికారం చేపట్టినా, పట్టుమని పదిహేను నెలలకే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం 60 మంది సభ్యు లున్న మణిపుర్‌ అసెంబ్లీలో నిజానికి బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రం అతలాకుతల మవుతున్న వేళ... బీరేన్‌ స్థానంలో అన్ని వర్గాలకూ అనుకూలుడైన కొత్త వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, రాష్ట్రపతి పాలనను నివారించి ఉండవచ్చు. కానీ, సీఎం అభ్యర్థిపై సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. పైగా, కుకీ–జో వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఘర్షణలు మొదలైన నాటి నుంచి సభకు దూరంగా ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది. చివరకు, ఘర్షణలు మొదలైన 21 నెలల తర్వాత రాష్ట్రపతి పాలనే శరణ్యమైంది. కానీ, అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. ఈశాన్య భారత అభివృద్ధికి తామే బాటలు వేస్తున్నామంటున్న పాలక పార్టీ మణిపుర్‌ వ్యవహారాన్ని సరైన రీతిలో చక్కదిద్దలేకపోయిందన్న శాశ్వత అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించినా, పర్వత ప్రాంత రాష్ట్రంలో పరిస్థితి నేటికీ నివురు గప్పిన నిప్పులానే ఉందని శని, ఆదివారం నాటి ఘటనలు మరోమారు ఋజువు చేశాయి.అక్కడి ఉద్రిక్తతను ప్రపంచానికి నివేదిస్తున్న విలేఖరులు సైతం శనివారం భద్రతా బలగాల దాడికి గురయ్యారు. పాత్రికేయులపై రాష్ట్రంలో పదే పదే జరుగుతున్న దాడులకు నిరసనగా చివరకు సోమవారం మణిపుర్‌లోని ప్రధాన పత్రికలన్నీ తమ పేపర్‌లో సంపాదకీయ స్థానాన్ని ఖాళీగా వదిలేశాయి. పత్రికలన్నీ సమష్టిగా నిలిచి ఇలా అరుదైన రీతిలో తమ నిరసన తెలియ జేయడం ఓ బలమైన సందేశం. మణిపుర్‌లో ఇప్పటికీ మామూలు పరిస్థితులు లేవనడానికి ప్రతీక. అసలు రెండేళ్ళ క్రితం ఘర్షణలు చెలరేగగానే ఆ ఏడాది జూన్‌ 4న కేంద్రం ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేసింది. పదే పదే పొడిగింపుల ప్రహసనంతో సదరు సంఘం కాలపరిమితి ఈ ఏడాది నవంబర్‌ దాకా దేకింది. అప్పటికైనా ఆ సంఘం కొత్తగా తేల్చేదేమిటో, దాని నివేదికతో ఒరిగేదేమిటో చెప్పలేం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని 2023 ఆగస్టులో సుప్రీమ్‌ కోర్ట్‌ వ్యాఖ్యానించినా మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. నష్టనివారణలో చిత్తశుద్ధి కరవైంది. రాష్ట్రపతి పాలనతో పరిస్థితి మెరుగువతుందనుకుంటే అడియాసైంది. గవర్నర్‌ సైతం ఇంఫాల్‌ విమానాశ్రయం నుంచి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్ళాల్సిరావడం దిగ్భ్రాంతికరం. సాక్షాత్తూ బీజేపీ ఎంపీ ఒకరు 2020లో స్థాపించిన ‘ఏటీ’ సాయుధ పౌరసైన్యంగా మారి హింసకు పాల్పడి, ఆయు ధాలను కొల్లగొట్టినట్టు కథనం. ఎవరెన్నిమార్లు అభ్యర్థించినా, ఇప్పటికీ ఆయుధాలను అప్పగించ లేదు. రేపు అవి మరే నేరగాళ్ళ చేతిలో పడి, ఎక్కడకు దారి తీస్తాయో ఊహించలేం. గతంలో పలు తీవ్రవాద వర్గాలు నిషేధానికి గురైనా, ఇప్పటికీ ఏటీని ఎందుకు నిషేధించలేదంటే జవాబూ లేదు. ఇంత జరుగుతున్నా ప్రధాని పెదవి విప్పకపోవడం, ప్రపంచమంతా తిరుగుతున్నా ఈశాన్యంలో పర్యటించి భరోసా ఇవ్వకపోవడం సమర్థించలేం. ఇప్పటికైనా తీవ్రతను గుర్తించి, విభిన్న వర్గాల మధ్య సామరస్యానికి కృషి చేయాలి. హింస కన్నా అభివృద్ధి ముఖ్యమని నచ్చజెప్పాలి. వేలాది సగటు మణిపురీలు అనేక నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సి రావడం అన్ని పార్టీల సమష్టివైఫల్యం. ఇది ఇలాగే కొనసాగితే మానవత్వానికే మాయనిమచ్చ. దేశసమగ్రతకే ప్రమాదం.

Not only rcb 11 other teams are also getting their first title this year9
ఈ ఏడాది... కలిసొచ్చింది!

ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్‌ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్‌ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్‌లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్‌’ విరాట్‌ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్‌బాష్‌ టి20 లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్, చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ), ఎఫ్‌ఏ కప్‌లో క్రిస్టల్‌ ప్యాలెస్‌ జట్లు ఈసారే తొలి టైటిల్‌ సాధించాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రాయల్‌ యూనియన్‌ సెయింట్‌ గిల్లోయిస్‌ ఇప్పటి వరకు 12 టైటిల్స్‌ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్‌ యూనియన్‌ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్‌కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్‌ ప్యాలెస్‌... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ చాలెంజ్‌ కప్‌ (ఎఫ్‌ఏ కప్‌)లో క్రిస్టల్‌ ప్యాలెస్‌ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్‌ ప్యాలెస్‌ 1–0 గోల్స్‌ తేడాతో మాంచెస్టర్‌ సిటీ జట్టును ఓడించి టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్‌ హరికేన్స్‌ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్‌ హరికేన్స్‌ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్‌ మిచెల్‌ ఓవెన్‌ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్‌ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్‌..నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) లీగ్‌లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్‌ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్‌ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్‌ ఆఫ్‌ సెవెన్‌’ పద్ధతిలో టైటిల్‌ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్‌ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్‌బీఏ ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్‌ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్‌పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్‌ 123–107తో ఇండియానా పేసర్స్‌ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్‌జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్‌ 1న జరిగిన తుదిపోరులో పీఎస్‌జీ జట్టు 5–0 గోల్స్‌ తేడాతో ఇంటర్‌ మిలాన్‌ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్‌ కప్‌లో పీఎస్‌జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్‌ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ...టి20 ఫార్మాట్‌లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్‌ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్‌లో పోటీ పడుతున్న ఆర్‌సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్‌లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్‌–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్‌ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్‌బాల్‌ క్లబ్‌... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్‌ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్‌ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్‌ తేడాతో ఏసీ మిలాన్‌ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్‌లోని డెవెంటర్‌ నగరానికి చెందిన ‘గో అహెడ్‌ ఈగల్స్‌’ ఫుట్‌బాల్‌ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్‌ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్‌... 1933 తర్వాత తొలి సారి డచ్‌ కప్‌ గెలుచుకుంది. ఏప్రిల్‌ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్‌’లో ఈగల్స్‌ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్‌గార్ట్‌ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ వీఎఫ్‌బీ స్టుట్‌గార్ట్‌.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్‌బీ పోకల్‌ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్‌గార్ట్‌ 4–2 గోల్స్‌ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్‌ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్‌గార్ట్‌ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన స్టుట్‌గార్ట్‌... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్‌ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్‌కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు స్టార్‌ హ్యారీ కేన్‌కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్‌కు టైటిల్‌ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్‌ స్ట్రయికర్‌ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్‌ మ్యూనిక్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్‌లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టిన కేన్‌... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్‌ఏ కప్‌ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ కప్‌ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్‌ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో లివర్‌పూల్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ టోటెన్‌హామ్‌ హాట్‌స్పర్‌... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్‌ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్‌హామ్‌ ఎఫ్‌సీ 1–0 గోల్స్‌ తేడాతో మాంచెస్టర్‌ యునైటెడ్‌పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది.

Silver price hits record of Rs 1. 04 lakh for kg10
కొనసాగుతున్న వెండి వెలుగులు

న్యూఢిల్లీ: వెండి రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం వెండి కేజీ ధర మరో రూ. 1,000 పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ. 1,08,100ని తాకిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటం, అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఎలక్ట్రిక్‌ వాహనాలు.. సౌర విద్యుత్‌ పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరగడం తదితర అంశాలు ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. వెండి అంతర్జాతీయంగా 13 ఏళ్ల గరిష్టం, దేశీయంగా లైఫ్‌టైమ్‌ గరిష్టాలను తాకినట్లు మెహతా ఈక్విటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కలాంత్రి తెలిపారు. యూరప్‌లో ద్రవ్యోల్బణం నెమ్మదించడం, వాణిజ్య వివాదాలు సమసిపోవడంపై ఆశావహ భావం నెలకొనడం లాంటి అంశాలతో వెండి ధర కన్సాలిడేషన్‌ శ్రేణి నుంచి బైటపడిందని, ఔన్సు (31.1 గ్రాములు) రేటు 36 డాలర్లను అధిగమించిందని పేర్కొన్నారు. మరోవైపు, న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 280 మేర తగ్గి రూ. 97,780కి (పన్నులు సహా) పరిమితమైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ త గల బంగారం ధర రూ. 250 క్షీణించి రూ. 97,350కి తగ్గింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య సానుకూల సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశాభావం నెలకొన్న నేపథ్యంలో బంగారంలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాలకు డిమాండ్‌ కాస్త నెమ్మదించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement