● అర్ధరాత్రి అదుపు తప్పిన కారు ● ఐదుగురిని బలిగొన్న రహద
ఖురాన్ కోర్సు పూర్తి చేసుకున్న బిడ్డను చూసిన సంబురం ఆ కుటుంబ సభ్యుల్లో ఎంతోసేపు నిలువలేదు. కొడుకుకు అందిన సత్కారం ఆనవాళ్లు ఇంటికి చేరకముందే వారంతా తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. మరో పది నిమిషాల్లో గమ్యం చేరాల్సి ఉండగా రహదారిపై మాటు వేసిన మృత్యువు ఐదుగురిని కబళించింది. అదే వారికి ఆఖరు
ప్రయాణమైంది.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ గౌస్ ఆలం
ఘటనాస్థలంలో నుజ్జునుజ్జయిన వాహనం
ఆదిలాబాద్‌టౌన్/గుడిహత్నూర్: తమ కుమారుడు హాఫిజే ఖురాన్ కోర్సు పూర్తి చేసుకోవడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ మురిపం తీరకముందే ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యు ఒడికి చేరారు. కొద్ది నెలల క్రితం 14 ఏళ్ల ఆ బాలుడిని కుటుంబీకులు భైంసాలోని దారుల్–ఉలుమ్‌లో చేర్పించారు. కోర్సు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రాత్రి అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాలుడికి ఘనసత్కారం అనంతరం అక్కడ ప్రార్థనలు నిర్వహించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో వాహనం అదుపుతప్పింది. ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. విషయం తెలియడంతో కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వారురోధించిన తీరు అందరిని కంటతడి
పెట్టించింది.
గాలిలో కలిసిన ఐదుగురి ప్రాణాలు..
ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన మహ్మద్ ఫరీదొద్దీన్(14) ఖురాన్ హాఫీజ్ కోర్సును భైంసాలో పూర్తి చేసుకోగా ఆ బాలుడిని అక్కడ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ నుంచి కారులో ఏడుగురు కుటుంబీకులు సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో బయల్దేరి వెళ్లారు. కార్యక్రమం అనంతరం రాత్రి 9.15 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఏడుగురితో పాటు ఆ బాలుడిని సైతం వారితోనే తీసుకొస్తున్నారు. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద రాత్రి 11గంటల సమయంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న సయ్యద్ మోయిజొద్దీన్ (67), అతడి అల్లుడు ఖాజా మోయినొద్దీన్ (43)తోపాటు ఖాజా కుమారుడు ఉస్మానొద్దీన్(8)తో పాటు మొయిజొద్దీన్ కొడుకు కుమారుడు మహ్మద్ అలీ(5) ఘటనా స్థలంలోనే మరణించారు. ఖాజా మరో కుమారుడు, సత్కార గ్రహీత ఫరీదొద్దీన్(14) రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన మోయినొద్దీన్ భార్య ఆయేషా, కూతురు ఇఖ్రా, కొడుకు సాద్ ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మోయిజొద్దీన్ విద్యుత్ శాఖలో ఫోర్‌మెన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన అల్లుడు ఖాజా మోయినొద్దీన్ విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య ఆయేషాతోపాటు ముగ్గురు కుమారులు ఫరీదొద్దీన్, ఉస్మానొద్దీన్, సాద్, కుమార్తె ఇఖ్రా సంతానం. పెద్ద కుమారుడు ఫరీదొద్దీన్ ఖురాన్ హాఫీజ్ కోర్సు పూర్తి చేయగా ఇద్దరు కుమారులు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు సయ్యద్ మోయిజొద్దీన్ మనవడు అస్లమ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు.
అతివేగమే కారణం..
వాహనాన్ని సయ్యద్ మోయిజొద్దీన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్దకు చేరుకున్న సమయంలో వాహనం వేగంతో ఉండడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. డివైడర్లను ఢీకొట్టి బోల్తా పడింది. నలుగురు ఘటనా స్థలంలో, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందారు.
ఒకేసారి ఐదుగురి అంతిమయాత్ర..
టీచర్స్ కాలనీ నుంచి ఒకేసారి ఐదుగురి అంతిమ యాత్రను ఈద్గా మైదానం వరకు నిర్వహించారు. కుటుంబీకులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం రిమ్స్‌లో పోర్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈద్గాలోని ఖబరస్తాన్‌లో వరుస క్రమంలో ఖననం చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
ప్రమాద స్థలాన్ని ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. డేంజర్‌స్పాట్స్‌ను గుర్తించి నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఇంద్రవెల్లి ఎస్సై సునీల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment