ఎంపీ, ఎమ్మెల్యేలతోనే అప్రతిష్ట పాలు
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలతోనే ఆదిలాబాద్ పత్తి మార్కెట్ అప్రతిష్ట పాలైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే పత్తి కొనుగోళ్లలో రెండవ ప్రాధాన్యం ఉన్న ఆదిలాబాద్ మార్కెట్‌కు మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా, భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రెటరీని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణమేంటని ప్రశ్నించారు. కొనుగోళ్ల విషయంలో కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో కనీసం ఒక్క సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. గత పదేళ్లలో ఇంతకంటే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, మార్శెట్టి గోవర్ధన్, ధమ్మపాల్, కొండ గణేశ్, బట్టు సతీశ్, గంగయ్య, దాసరి రమేశ్, బుట్టి శివకుమార్, దేవిదాస్, అడప తిరుపతి, శ్రీనివాస్, ఉగ్గే విఠల్, కలీమ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment