పంటల లెక్క.. ఇక పక్కా
● పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్న ఏఈవోలు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లు
బోథ్: పంటల లెక్క పక్కాగా తేల్చేందుకే ప్రభుత్వం ఈ నెల 3న డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని 101 క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల చేలల్లోకి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగానే రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశశం ఉంటుంది. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధి లో 18వందల నుంచి 2వేల ఎకరాల వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సర్వే ఇలా..
ఈ సర్వే నిర్వహణకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. ఇందులో భా గంగా ఏఈవోలు రైతుల చేల వద్దకు వెళ్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం వివరాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. అలాగే సాగు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్‌క్రాప్ కింద నమోదు చేస్తున్నారు.
పంటల నమోదు ఆధారంగానే కొనుగోళ్లు..
ఈ సర్వేతో రైతులు సాగు చేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని మార్కెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.
పలు చోట్ల ఇబ్బందులు..
సర్వేలో భాగంగా ఏఈవోలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో యాప్ ఓపెన్ కావడం లేదు. అలాగే పలు చోట్ల సర్వర్ నెమ్మదించటం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వే నంబర్లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఏఈవోలు చెబుతున్నారు.
సర్వేతో పక్కాగా సాగు లెక్క
జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈవోలు రైతుల చేలల్లోకి వెళ్లి పంటల సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా వ్యాప్తంగా రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో లెక్కలు పక్కాగా రానున్నాయి.
– శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాఽయాధికారి
పంటల లెక్క.. ఇక పక్కా
Comments
Please login to add a commentAdd a comment