కైలాస్‌నగర్: రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 97 హ్యాబిటేషన్లలో తాగునీటి ఇక్కట్లు గుర్తించి బోరు బావులు, బావులు, పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానిపై నివేదిక అందజేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంద్రవెల్లి, గాదిగూడ, ఉట్నూర్, అదిలాబాద్ రూరల్ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేయాలని సూచించారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ ిపీవో ఖుష్బూ గుప్తా, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment