17ఏళ్ల కల.. నెరవేరిన వేళ | - | Sakshi
Sakshi News home page

17ఏళ్ల కల.. నెరవేరిన వేళ

Published Sun, Feb 16 2025 12:13 AM | Last Updated on Sun, Feb 16 2025 12:12 AM

17ఏళ్ల కల.. నెరవేరిన వేళ

17ఏళ్ల కల.. నెరవేరిన వేళ

● డీఎస్సీ–2008 అభ్యర్థులకు పోస్టింగ్‌ ● హైకోర్టు ఉత్తర్వులతో కాంట్రాక్ట్‌ టీచర్‌ కొలువు ● అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు ● జిల్లాలో 10 మందికి ప్రయోజనం

ఆదిలాబాద్‌టౌన్‌: 2008–డీఎస్సీ బీఎడ్‌ అభ్యర్థుల న్యాయ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కాంట్రాక్ట్‌ కొలువు దక్కింది. రెండు, మూడు నెలల క్రితం అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి వీరికి పోస్టింగ్‌ విషయంలో గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో జాప్యం అయింది. దీంతో సదరు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీలోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాల మీద నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 74 మందికి ప్రయోజనం చేకూరగా ఆదిలా బాద్‌ జిల్లాలో 10 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా వారికి వివిధ పాఠశాలల్లో పోస్టింగ్‌ కల్పించారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్‌ పద్ధతిలోనైనా ప్రభుత్వ కొలువు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరికి డీఈవో ప్రణీత నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యాలయ ఉద్యోగులు తుషార్‌, సతీష్‌, సాయితేజ, గోవర్దన్‌ ఇందులో పాల్గొన్నారు.

ఫలించిన నిరీక్షణ ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ సమయంలో కామన్‌ నియమాకాలు చే పట్టారు. దీంతో ఎస్జీటీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో 70:30 నిష్పత్తిలో డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 135 మంది అభ్యర్థులు ఎంపికై నప్పటికీ 70: 30 కారణంగా ఉద్యోగా లకు దూరమయ్యారు. అప్పటి నుంచి వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరికి కాంట్రాక్ట్‌ పద్ధతిలోనైనా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల వివరాలను సేకరించింది. చాలా మంది ఇతర శాఖల్లో కొలువులు పొందారు. అర్హులుగా గుర్తించిన వారిలో ప్రస్తుతం ఉ మ్మడి జిల్లా పరిధిలో 74 మంది మాత్రమే మిగిలిపో యారు. ఆదిలాబాద్‌ జిల్లాకు 10 మంది, మంచిర్యాలకు 14 మంది, నిర్మల్‌కు 20 మంది, కుమురంభీం ఆసిఫాబాద్‌కు 30మందిని ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు నియామక ప్రక్రియ పూర్తి చేశారు.

కాంట్రాక్ట్‌ పద్ధతిన..

2008 డీఎస్సీ బీఎడ్‌ అభ్యర్థులకు కాంట్రాక్ట్‌ పద్ధతిన పోస్టింగ్‌ ఇచ్చారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు లేని పాఠశాలలను ఎంపిక చేసి పోస్టింగ్‌ కల్పించారు. బోథ్‌, గాదిగూడ మండలానికి ఇద్దరు చొప్పున, భీంపూర్‌, జైనథ్‌, బేల, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, సిరికొండ మండలాలకు ఒకరు చొప్పున కేటాయించారు. వీరికి నెలకు రూ.31,040 వేతనం చెల్లించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు ఈ వేతనంపై వీరు సేవలందించాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మళ్లీ వీరంతా తిరిగి రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నియామకం పొందిన కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్‌ బాండ్లను సైతం అందించాల్సి ఉంటుందని అధికారులు తెలి పారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాఠాలు బోధించేందుకు బడిబాట పట్టడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement