ఫలించిన నిరీక్షణ
● రూ.4.90 కోట్ల పెండింగ్ ఎంపీ ల్యాడ్స్ విడుదల ● బిల్లుల చెల్లింపునకు అధికారుల కసరత్తు ● కాంట్రాక్టర్లు, నాయకుల హర్షం
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఎంపీ హయాంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 17వ లోక్‌సభకు సంబంధించి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా విడుదల చేసింది. వాటి చెల్లింపునకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. వారం, పది రోజుల్లో పనులు చేసిన వారందరికీ బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర నిర్ణయంపై ఈ నిధులతో పనిచేసిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
మూడేళ్ల క్రితం పనులు పూర్తి...
2019–24కి సంబంధించి 17వ లోక్‌సభకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సోయం బాపూరావు కొనసాగారు. ఈ సమయంలో ఎంపీ ల్యాడ్స్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో రూ.4.90 కోట్లతో కూడిన 160 పనులను ప్రతిపాదించారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ వంటి తది తర పనులున్నాయి. ఎంపీ ప్రతిపాదించగా వాటికి కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు, బీజేపీ నాయకులు, అప్పటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు ఈ పనులను తమతమ ప్రాంతాల్లో చేపట్టి పూర్తి చేశారు.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో రూ.3.90 కోట్లతో 137 పనులు చేపట్టారు. అలాగే నిర్మల్ జిల్లాలో రూ.52లక్షలతో 11 పనులు, కుమురంభీం జిల్లాలో రూ.43లక్షలతో 11 పనులు, మంచిర్యాల జిల్లాలో రూ.4లక్షలతో కూడిన ఒక పనిని పూర్తి చేశారు. ఈ పనులు పూర్తయి ఏళ్లు గడిచినప్పటికీ నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం చేసింది. ఎంపీగా సోయం పదవీ కాలంలో ఎంత ప్రయత్నించినప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన వారంతా ఇప్పటి వరకు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగి ఇబ్బందులు పడ్డారు.
ఎట్టకేలకు విడుదల...
గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్ బీజేపీ తరఫున గెలుపొందారు. ఆయన గెలిచిన రెండు నెలలకే తన నియోజకవర్గ నిధికి సంబంధించి కేంద్రం రూ.5కోట్ల ఎంపీ ల్యాడ్స్ విడుదల చేసింది. అయితే సోయం పదవీ కాలానికి సంబంధించిన నిధులు మాత్రం పెండింగ్‌లోనే పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడంతో ఆ నిధులు విడుదలవుతాయో లేవోనని పనులు పూర్తి చేసిన వారిలో ఆందోళన వ్యక్తమైంది. వాటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తుండగా వారి నిరీక్షణకు తెరదించుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పెండింగ్‌లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ బిల్లులను చెల్లించే దిశగా ప్రణాళిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. ఏళ్లుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment