‘ఇంటిగ్రేటెడ్’ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య ● నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశం
కైలాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు గురువారంలోపు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రానున్న రెండేళ్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వాటి ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్‌ఘాట్‌లో గల సర్వేనంబర్ 38లో 20 ఎకరాల స్థలాన్ని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అన్ని హంగులతో పాఠశాల, వసతి గృహ సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. గడువులోపు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కు మురంభీం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష
ముందుగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చాంబర్‌లో కృష్ణ ఆదిత్య సమీక్ష నిర్వహించారు. ప్రాక్టికల్, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీందర్‌కుమార్‌ను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో హాజరు శాతం, స్లిప్ టెస్టులు, విద్యార్థుల ప్రవేశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలి
వేసవిలో మారుమూల ప్రాంతాలు, మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కృష్ణఆదిత్య అన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బోరుబావుల ఫ్లషింగ్, నీటి వనరుల మరమ్మతు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment