రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిపేట శివారులో మంచిర్యాల వైపు వెళ్తున్న కారు లక్సెట్టిపేట వైపు వెళ్తున్న రెండు బైక్‌లను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న మంచిర్యాలలోని హైటెక్‌సిటీ కాలనీకి చెందిన ఇందారపు శివప్రియ(49) అక్కడికక్కడే మృతి చెందింది. మరో బైక్ నడుపుతున్న చెన్నూర్ మండలం లింగంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎండీ నయీమోద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కాగా, శివప్రియ లక్సెట్టిపేట బాలికల గురుకుల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రాత్రి విద్యార్థుల స్టడీ అవర్స్ కోసం పాఠశాలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భర్త శివప్రసాద్ రెండేళ్ల క్రితం మృతి చెందగా శివప్రియకు 9వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. రోడ్డు ప్రమాదం ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడగా, ఎస్సై సురేశ్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలపై ఆరా తీశారు. ఘటనకు కారణమైన కారుడ్రైవర్ సత్తయ్య పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment