● కొత్త వాటికి కూడా అవకాశం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభ
కై లాస్‌నగర్: ప్లాట్ల క్రయ విక్రయాలు మందగించడం, నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో ఉండటాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేగవంతం చేసే దిశగా దృష్టి సారించింది. అలాగే అక్రమ లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లన్నింటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వాటికి సైతం అవకాశం కల్పించడంతో పాటు ఈ మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే నిర్దేశిత ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరనుంది.
అక్రమ ప్లాట్లన్నింటికీ అవకాశం
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 2020 ఆగస్టు 26వరకు రూ.1,000 చెల్లించి మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇందులో అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం మున్సిపల్ టౌన్‌ప్లానింగ్‌లో వాటి పరిశీలనకు తగినంత సిబ్బంది లేకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌లో నిబంధనలను సడలించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, అక్రమ లేఅవుట్లలో పది శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయి మిగతా విక్రయించకుండా ఉన్న వాటికి సైతం ప్రస్తుతం అవకాశం కల్పించింది. పెండింగ్ రెగ్యులరైజేషన్ చార్జీలతో పాటు లేఅవుట్‌లో ఖాళీగా ఉన్న ప్లాట్ల విస్తీర్ణం ప్రకారం చార్జీలు ఉంటాయని పేర్కొంది. వాటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో నమోదు చేసి పోర్టల్‌లో నమోదు చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
25శాతం రాయితీతో వేగవంతం
అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట వేయాలని భావించిన గత ప్రభుత్వం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే ఆ లేవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. దీంతో వందలాదిగా ఉన్న అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రయవిక్రయాలన్నీ నిలిచిపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు అటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం తగినంత సిబ్బంది లేకపోవడమే. దీనిని గమనించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ వేగవంతంతో పాటు అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరోసారి అవకాశం కల్పించింది. అలాగే మార్చి 31లోపు రెగ్యులరైజ్ చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే వేలాదిగా ఉన్న అనధికార, అక్రమ ప్లాట్లు సక్రమం కానున్నాయి. అలాగే ప్రభుత్వ ఖజానాకు సైతం భారీగా ఆదాయం సమకూరనుంది.
ఉత్తర్వులు అందాయి
ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. అక్రమ లేఅవుట్లలోని రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అలాగే మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే ఫీజులోనూ 25శాతం రాయితీ వర్తిస్తుంది. పట్టణవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్
● కొత్త వాటికి కూడా అవకాశం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభ
Comments
Please login to add a commentAdd a comment