సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని ఈ మేరకు ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అవగాహనతోనే వాటిని అడ్డుకోగలుగుతామని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా cybercrime. gov. in అనే వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మొబైల్ హ్యాకింగ్, జాబ్‌ఫ్రాడ్, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్, డి జిటల్ అరెస్ట్, కస్టమర్ కేర్ ఫ్లాగ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, యూపీఐ ఫ్రాడ్, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ ఫ్రాడ్ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలన్నింటిపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వాటిని అప్రమత్తతతోనే నివారించవచ్చన్నారు. సైబర్ క్రైం జరిగిన మొదటి గంటలోపే ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి డబ్బులు రికవరీ చేయడం సులభతరం అవుతుందన్నారు. గడిచిన వారం వ్యవధిలో జిల్లాలో 15 సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించినట్లుగా ఆయన వెల్లడించారు. పట్టణంలోని వన్‌టౌన్‌లో ఏడు ఫిర్యాదులురాగా, టూటౌన్‌లో ఒకటి, రూరల్‌లో రెండు, నేరడిగొండ, బేల, ఇంద్రవెల్లి, సిరికొండ, నార్నూర్ స్టేషన్లలో ఒక్కో ఫిర్యాదు చొప్పున వచ్చినట్లు తెలిపారు.


