కారులో నిద్రిస్తున్న వారిపై దాడి
● ల్యాప్‌టాప్, బ్యాగు అపహరణ ● టేక్రియాల్‌లో రెచ్చిపోయిన దుండగులు
కామారెడ్డిక్రైం: రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరరాఘవయ్య కుమారుడు నాగమణిదీప్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో కుమారుడిని స్వగ్రామానికి కారులో తీసుకొస్తున్నాడు. వీరరాఘవయ్య వెంట స్నేహితుడు కూడా ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో టేక్రియాల్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఓ హోటల్ ఎదుట రోడ్డు పక్కన కారు నిలిపి అందులో నిద్రించారు. నలుగురు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి వారిపై దాడి చేసి కారులోని బ్యాగు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. దాడిలో వీర రాఘవయ్యకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే రాఘవయ్య భయంతో కారును దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోని సదాశివనగర్ వరకు తీసుకెళ్లాడు. అక్కడ కారును నిలిపి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్‌చంద్ర, దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


