
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ రాజర్షిషా
నార్నూర్: ప్రతీ ఒక్కరికి పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని నడ్డంగూడ సీఎస్‌సీ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. పోషణ్ పక్షం– 2025లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినీ అంగన్‌వాడీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా పోషణ్ పక్షం కార్యక్రమాన్ని ఈనెల 8నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు బాలామృతం, పౌష్టికాహారంతో పాటు ఐరన్ ఫోలిక్ మాత్రలను అందించాలన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవం అయ్యేలా చొరవచూపాలన్నారు. జిల్లాను ఎనీమియా ముక్త్‌గా తీర్చిదిద్దేలా రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం చిత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇళ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మహళా శిశు సంక్షేమ శాఖ పీడీ మిల్కా, సీడీపీవో శారద, ఎంపీడీవో జవహర్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు.