పాలనలో రాజర్షి మార్క్‌ | - | Sakshi
Sakshi News home page

పాలనలో రాజర్షి మార్క్‌

Apr 21 2025 7:52 AM | Updated on Apr 21 2025 7:52 AM

పాలనల

పాలనలో రాజర్షి మార్క్‌

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్షి షా తన మార్కు చూపుతున్నారు. అడవులు, ఆది వాసీ జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్‌ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషి చేస్తున్నారు. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితులను అవగతం చేసుకుంటూ లోటు పాట్లను సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు అక్రమార్కులకు తనదైన శైలిలో చెక్‌ పెడుతున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలోనే రెండు జాతీయ స్థాయి అవార్డులు, ఒక రాష్ట్రస్థాయి పురస్కారం వరించడం తన మార్క్‌ పాలనకు అద్దం పడుతోంది. సోమవారం ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా నీతి ఆయోగ్‌ అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజర్షి షా పాలనాదక్షతపై ప్రత్యేక కథనం.

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంపై రాష్ట్రస్థాయి పురస్కారం..

● పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాజ ర్షి షా గతేడాది మార్చి 6న ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే జిల్లా పరిస్థితులను అవగతం చేసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేసినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నారు. అలాగే రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

‘ఆరోగ్య పాఠశాల– కళాశాల’ అమలుతో వరించిన ‘స్కోచ్‌’

● సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రభు త్వ బడులను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యార్థుల అలవాట్లను గమనించిన కలెక్టర్‌ వాటిని మా ర్చాలని సంకల్పించారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని గతేడాది నవంబర్‌ 14న ‘ఆరోగ్య పాఠశాల– కళాశాల ’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, చదువులో రాణించేందుకు అనుసరించాల్సిన కార్యక్రమాలపై వారంలో ఏడు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్దేశించారు. ప్రతీ పా ఠశాలకు గైడ్‌ టీచర్‌తో పాటు స్టూడెంట్‌ చాంపియన్లను ఎంపిక చేశారు. కార్యక్రమ అమలుపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించారు. ప్రగతిపై ఆరా తీస్తూ లోటుపాట్లను సవరించారు. స్వల్ప వ్యవధిలోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమం సఫలీకృతం చేసి స్కోచ్‌ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు.

నీతి ఆయోగ్‌ పురస్కారానికి ఎంపిక

● నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న బ్లాక్‌ ఆస్పిరేషనల్‌ ప్రోగ్రాం– 2024కు గాను ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాని కి కలెక్టర్‌ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 426 ఆస్పిరేషనల్‌ బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా జిల్లాలోని నార్నూర్‌ టాప్‌– 5లో నిలువడం కలెక్టర్‌ పాలనాదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్‌ 2022 నుంచి డిసెంబర్‌ 2024 వరకు ఆ బ్లాక్‌లో ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నీతి ఆయోగ్‌ దృష్టి సారించింది. ఆ సంస్థ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ నార్నూర్‌ మండలం పలు రంగాల్లో ప్రగతిని సాధించింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారం అందించి గర్భిణులు, చిన్నారులు, బాలింతల ఆరో గ్యం మెరుగుపరడంతో పాటు ప్రాథమిక శిశు సంరక్షణ, విద్యా ఫలితాలు, డిజిటల్‌ పరిజ్ఞా నం, ఆర్థిక చేకూర్పు, గిరిజన విద్యార్థుల సంక్షేమం, సహజ వ్యవసాయం, చెక్‌ డ్యాంల ని ర్మాణం, స్వయంసహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించడం, మోడల్‌ సీఎస్సీ సెంటర్‌ ద్వారా ప్రజల జీవనోపాధిలో పురోగతి సాధించింది. వాటిపై పలు విడతల్లో మదింపు చేసిన నీతి ఆయోగ్‌ అధికారులు ఐదు ప్రధాన అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ డే పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్‌ ఈ అవార్డు అందుకోనున్నారు.

ఏడాదిలోనే రెండు జాతీయ అవార్డులు

గవర్నర్‌ చేతుల మీదుగా మరో పురస్కారం

రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు

నేడు ప్రధాని చేతుల మీదుగా నీతి ఆయోగ్‌ అవార్డు

అందరి సహకారంతోనే..

కేంద్రం నిర్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను నార్నూర్‌ బ్లాక్‌లో పకడ్బందీగా అమలు చేశాం. అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో నీతి ఆయోగ్‌ అవార్డు రావడం జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మంత్రి సీతక్కతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలందరి సహకారంతోనే ఈ అవార్డు లభించింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు జిల్లా అభివృద్ధికి మరింత తోడ్పడనుంది.

– రాజర్షి షా, కలెక్టర్‌

పాలనలో రాజర్షి మార్క్‌1
1/2

పాలనలో రాజర్షి మార్క్‌

పాలనలో రాజర్షి మార్క్‌2
2/2

పాలనలో రాజర్షి మార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement