అల్లూరి సీతారామరాజు: తల్లిదండ్రులే కన్నకొడుకుని చంపించారనే నిజం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఈనెల పదో తేదీన ఎటపాక మండలం రాయనపేట పంచాయతీ పరిధిలోని తుమ్మలనగర్ సమీపంలో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేశారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. ఈ హత్య ఘటన వివరాలను రంపచోడవరం అడిషనల్ ఎస్పీ కేవీ మహేందర్‌రెడ్డి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మృతుడు దుర్గా ప్రసాద్‌కు తల్లిదండ్రులు సావిత్రి, రాము మధ్య తరచూ ఆస్తి తగదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు తనకు రాయాలంటూ దుర్గాప్రసాద్ తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఇల్లు అమ్ముకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇల్లు అమ్మేందుకు కన్నకొడుకు దుర్గా ప్రసాద్ అడ్డంకిగా మారడంతో ఎలాగైనా అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. భద్రాచలం పట్టణంలోని జగదీష్‌కాలనీకి చెందిన గుమ్మడి రాజు, షేక్ అలీపాషాకు రూ.3 లక్షల సుపారి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈనేపథ్యంలో ఈనెల 9వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గా ప్రసాద్‌ను వారిద్దరితోపాటు తల్లిదండ్రులు కలిసి కత్తితో పీక కోసి చంపేశారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకుని సరిహద్దునే ఉన్న ఆంధ్రా పరిధిలోని తుమ్మలనగర్ సమీపంలో పొదల మాటున పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు పాల్పడిన నలుగురు ఈనెల 25న చత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోతుండగా పురుషోత్తపట్టణం చెక్‌పోస్టు వద్ద వారిని సీఐ గంజేంద్రకుమార్, ఎస్‌ఐ పార్థసారధి అదుపులోకి తీసుకున్నారని అడిషనల్ ఎస్పీ వివరించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న వారిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment