కవర్లు ఇక్కడ.. కందిపప్పు ఎక్కడ ?
అడ్డతీగల: ప్రజావసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే కంది పప్పు ప్యాక్ చేసిన ఖాళీ కవర్లు తుప్పల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అడ్డతీగల శివారు డి.భీమవరం రోడ్డులో ఇవి ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ మండల లెవిల్ స్టాక్ పాయింట్‌కి సమీపంలో ఈ కవర్లు పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఒక కిలో కందిపప్పు పట్టేంతగా ఉన్న కవర్లపై బ్యాచ్ నంబర్ 10/2024, ప్యాకింగ్ తేదీ అక్టోబర్ 2024, ఐదు నెలల్లో వినియోగించాలని ముద్రించి ఉంది. ఇలా తుప్పల్లో ఖాళీ కవర్లు కనిపించడంతో అందులో ఉండవలసిన కందిపప్పు ఏమైందో తెలియాల్సి ఉంది.పౌరసరఫరాల శాఖ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కి వచ్చే సరకును అక్కడి నుంచి రేషన్‌డిపోలకు చేరవేయాలి. రేషన్ డీలర్లు వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. పేదలకు అందవలసిన కందిపప్పును మాయం చేసి, వేరే బ్యాగ్‌లో వేసుకుని ఖాళీ కవర్లు ఊరికి దూరంగా పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వీటి నిగ్గు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తుప్పల్లో వందకుపైగా కవర్లు
అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కవర్లు ఇక్కడ.. కందిపప్పు ఎక్కడ ?
Comments
Please login to add a commentAdd a comment