పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : జిల్లాలో టెన్త్, ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ దినే ష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, 144వ సెక్షన్ అమలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో ఉన్న జెరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు పరీక్షల సమయాల్లో మూసి వేయాలన్నారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని, అత్యవసర కారణాలతో కేవలం 15 నిమిషాల ఆలస్యాన్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలకు ప్రతి కేంద్రానికి ఒక జిల్లాస్థాయి అధికారి నోడల్ అధికారిగా వ్యవహ రిస్తారని చెప్పారు.తనతో పాటు జేసీ, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు నిత్యం క్షేతస్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న 258 పాఠశాలల్లో 11,766 మంది విద్యార్థులు టెన్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఓపెన్ టెన్త్‌లో 1,297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు. మార్చి 17 నుంచి 31 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణ కోసం 9490270788 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,518 మంది, రెండో సంవత్సరానికి 5,335 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,322 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఓపెన్ విధానంలో 1,699 మంది ఇంటర్ పరీక్షలకు హాజరవుతార న్నారు. రెగ్యులర్ విద్యార్థులకు మార్చి ఒకటి నుంచి 20 వరకు, ఒకేషనల్ విద్యార్థులకు మార్చి 3నుంచి 15 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీఈవో బ్రహ్మాజీరావు, జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి అప్పలరాము, సహాయ కమిషనర్(పరీక్షలు) శశికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment