సకాలంలో ధ్రువీకరణ పత్రాల జారీ
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రజలకు సకాలంలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా న్యాయసేవల సంస్థ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీ సేవాసర్వీసెస్ ద్వారా 574 రకాల సేవలు అందిస్తున్నామని, సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుని అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నారు. ప్రజలు గ్రామసచివాలయాలను సందర్శించే సమయంలో డిజిటల్ సహాయకులు అందుబాటులో ఉండి,సకాలంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు.ప్రజలను పదేపదే తిప్పవద్దన్నారు.జిల్లాలో అధికశాతం గిరిజనులే ఉన్నారని,వారిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో వారంలో ఒకరోజు పౌరసేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోను నిర్లక్ష్యం వద్దన్నారు.
ధ్రువీకరణ పత్రాల జారీలో
జాప్యం వద్దు :న్యాయమూర్తి స్వర్ణ
ప్రజలకు ధ్రువీకరణ పత్రాల జారీ చేయడంలో జాప్యం వద్దని,ఆలస్యంగా జారీ చేయడం వల్ల సకాలంలో ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని జిల్లా న్యాయసేవా ప్రాధికారిక సంస్థ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ అన్నారు. ధ్రువీకరణపత్రాల జారీలో జాప్యం కారణంగా కొన్ని సమయాల్లో డీఎల్‌ఎస్‌ఎకు కేసులు పెరగడం గమనించినట్టు చెప్పారు. ఫేక్ ధ్రువీకరణ పత్రాలు జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,డీఆర్‌వో పద్మలత,డీపీవో లవరాజు,డీఎల్‌పీవో కుమార్,కలెక్టరేట్ పర్యవేక్షకుడు నాగరాజు,పాడేరు డివిజన్‌లోని తహసీల్దార్‌లు,ఎంపీడీవోలు పాల్గొన్నారు.
సకాలంలో ధ్రువీకరణ పత్రాల జారీ
Comments
Please login to add a commentAdd a comment