రైతులు ఇబ్బందులు పడుతుంటే విష ప్రచారమా ?
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
పాడేరు: గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, వారి సమస్యలు పరిష్కరించవలసిందిపోయి కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేయడం దుర్మార్గమని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డులో రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన తర్వాత కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. రాష్ట్ర మంత్రులు చేస్తున్న వాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. రైతుల కష్టాలను కూడా వక్రీకరించి అబద్ధాలను పోగు చేసి తప్పుడు ప్రచారం చేయడం కూటమి నాయకులకే చెల్లిందని ఆయన ధ్వజమెత్తారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వెళ్తున్నారని తెలిసిఉద్దేశపూర్వకంగానే భద్రత సమస్యను సృష్టించి కుట్రకు తెరలేపారన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన మండి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి 2014లో గిరిజన ప్రాంత ప్రజల ఓట్లతో శాసన సభ్యురాలిగా గెలిచి, ఇప్పుడు గిరిజన చట్టాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 1/70 చట్టానికి సవరణ చేయాలనే కుట్రకు 2018లోనే బీజం వేసిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొయ్యూరు మండలం షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న భూములకు గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలని కోరిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న గిడ్డి ఈశ్వరి ఈ ప్రాంతంలో తిరిగే నైతిక హక్కు కోల్పోయారని చెప్పారు. గిరిజన చట్టాలు, హక్కులను తూట్టు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న కూటమి నాయకులను గిరిజనులు నిలదీయాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కె.కనకాలమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కె.ఊర్వశిరాణి, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు లకే రామసత్యవతి, టి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ వంతాల బొంజుబాబు, ఎంపీటీసీ సభ్యురాలు సల్లా చిట్టమ్మ, పార్టీ సీనియర్ నాయకులు కూడా సుబ్రహ్మణ్యం, ఎం.సత్యనారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment