నిండు గర్భిణికి నరకయాతన
జి.మాడుగుల: రహదారి సరిగా లేకపోవడంతో ఓ నిండు గర్భిణిని ఏడు కిలోమీటర్లు డోలీపై మోయవలసి వచ్చింది. దీంతో ఆమె నరకయాతనకు గురైంది. మండలంలోని గడుతూరు పంచాయతీ బందులపనుకు గ్రామానికి చెందిన ఆదిమజాతి గిరిజన(పీవీటీజీ)తెగకు చెందిన పాంగి జ్యోతి నిండు గర్భిణి. ఆమెకు శుక్రవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ గ్రామం నుంచి కొత్తూరు వరకూ ఏడు కిలో మీటర్లు సరైన రోడ్డులేదు. అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో భర్త శ్రీను, కుటుంబ సభ్యులు డోలీలో ఆమెను కొత్తూరు వరకు అష్టకష్టాలు పడి తరలించారు. కొత్తూరు గ్రామం నుంచి ఆటోలో జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను అదే వాహనంలో జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారులు రవిచంద్రశేఖర్, ధనుష్‌లు వైద్యసేవలందించారు.
డోలీలో ఏడు కిలోమీటర్ల తరలింపు
Comments
Please login to add a commentAdd a comment