‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతర్
● నిర్దిష్ట ఆదేశాలున్నా.. తేలని శాంతి ఆశ్రమం భూముల పంచాయితీ ● గురువారం 11 గంటల్లోపు అప్పగించాలని లీజుదారులకు సుప్రీం కోర్టు ఆదేశం ● సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ.. స్వాధీనం చేయని లీజుదారులు
ఎంవీపీకాలనీ(విశాఖ): లాసన్స్ బే కాలనీలోని శాంతి ఆశ్రమం భూముల విషయంలో లీజుదారులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు లీజులో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఆశ్రమం యాజమాన్యానికి చెందిన పిటిషన్‌దారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు వేచి చూసినా.. ఫలితం లేకపోయింది. దీంతో లీజుదారులు కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశాన్ని మరోసారి సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆశ్రమానికి చెందిన పిటిషన్‌దారులు నిర్ణయించారు. పిటిషన్‌దారులు తెలిపిన వివరాలివీ..
దశాబ్దాల కిందట యోగా, మెడిటేషన్ సెంటర్ల నిర్వహణ పేరుతో ఉప్పలపాటి వివేకానంద కుటుంబం శాంతి ఆశ్రమం నిర్వాహకుడు యోగి రాఘవేంద్ర ద్వారా 6.4 ఎకరాల స్థలం లీజుకు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలంలో పెట్రోల్ బంక్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కార్ షెడ్లు, మల్టీ పార్కింగ్ ప్రాంతాలుగా అద్దెలకు ఇచ్చి.. ఆ స్థలాన్ని వివేకానంద కుటుంబ సభ్యులు కమర్షియల్‌గా వాడుకుంటున్నారు. లీజు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకుంటున్న స్థలాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ శాంతి ఆశ్రమ యాజమాన్యం కోర్టులను ఆశ్రయించింది. 25 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీం కోర్టు ఆ లీజు స్థలాలను వెనక్కి ఇచ్చేయాలంటూ తీర్పునిచ్చింది. అయితే వివేకానంద కుటుంబం అందుకు సమయం కోరగా.. రెండు సార్లు అవకాశం కల్పించింది. ఆ సమయంలో లీజుదారులు కోర్టులో సానుకూల ఆదేశాల కోసం ప్రయత్నించి పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టు వాటిని తోసిపుచ్చడంతో పాటు ఆ భూమిని ఆశ్రమానికి అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా..ఈ భూమిలో కొంత స్థలం వివిధ పార్టీ కార్యాలయాలకు వెళ్లినట్లు లీజుదారులు కోర్టుకు తెలిపారు. దీంతో నాలుగు ఎకరాల లీజు భూమిని స్వాధీనం చేయడానికి గతంలోనే అంగీకరించారు. అయితే అందుకు అనుగుణంగా అప్పగించకపోవడంతో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఆ 4 ఎకరాల భూమిని గురువారం(ఈ నెల 27) ఉదయం 11 గంటల్లోపు భూములను ఆశ్రమం యాజమాన్యానికి అప్పగించాలని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగాలని ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రం 4 గంటల వరకు వేచిచూసినా.!
ఈ క్రమంలో ఆశ్రమ యాజమాన్యప్రతినిధులు, ఎంవీపీ సీఐ మురళీ తదితరులు గురువారం ఉదయం లీజు భూములను పరిశీలించారు. కోర్టు ఆదేశాల మేరకు లీజు భూమంతా అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రతివాదులకు సూచించారు. వివేకానంద కుటుంబ సభ్యులతో పలుమార్లు మాట్లాడారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ భూమిని అప్పగించాలని సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. అయినప్పటికీ వివేకానంద కుటుంబ సభ్యులైన జి.గౌతమ్, కె.శ్రీదేవి ఆ భూములను అప్పగించలేదు. దీంతో కోర్టు నోటీసులను వారు అద్దెలకు(సబ్‌లీ జులకు) ఇచ్చిన పెట్రోల్ బంక్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, బస్సుల పార్కింగ్, క్రికెట్ కోచింగ్ సెంటర్, కార్ వాష్ సెంటర్లకు అతికించినట్లు ఆశ్రమ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. లీజుదారులు భూమిని స్వాధీనం చేయకపోతే 28వ తేదీ తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనునట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment