తొలి నుంచి గాదెకు ఆధిక్యం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను 20 టేబుల్స్‌కు సరిపడేలా కట్టలు కట్టారు. మొత్తం 20,971 ఓట్లు పోలవ్వగా 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 10,068 ఓట్లను మ్యాజిక్ ఫిగర్‌గా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గాదె 365 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గాదెకు మొదటి ప్రాధ్యాన్యత ఓట్లు 7,210 రాగా, రఘువర్మకి 6,845 ఓట్లు, విజయ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం విరామం అనంతరం ఎలిమినేషన్ రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. ప్రతి దశలోనూ గాదె ఆధిక్యం కొనసాగింది. మూడో స్థానంలో ఉన్న విజయ గౌరికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. 9వ రౌండ్‌లో గాదె 9,237 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. వర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. దీంతో తన ఓటమి ఖరారైందని భావించిన వర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు సాధించేందుకు గాదె ఇంకా 831 ఓట్ల దూరంలో నిలిచారు.
1967 ఓట్ల మెజారిటీతో విజయం
అప్పటికే వర్మ బయటికి వెళ్లిపోవడంతో వర్మకి చెందిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించాలా.. గాదె విజయాన్ని ధృవీకరించాలా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ ఎలక్షన్ కమిషన్‌కి అభ్యర్థించారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేంతవరకూ లెక్కించాలని చెప్పడంతో వర్మకి వచ్చిన ఓట్ల లెక్కింపును సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభించారు. గాదె మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లకు చేరుకోగానే అధికారికంగా గాదె విజయం సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేశారు. చివరకు గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి గాదె విజయం సాధించినట్లు సంతకం చేసి ఎన్నికల కమిషన్ సంతకం కోసం విజయవాడ పంపించారు.
తొలి నుంచి గాదెకు ఆధిక్యం
Comments
Please login to add a commentAdd a comment