బెత్తం దెబ్బ
కూటమికి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి టీచర్లు ఝలక్ పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికే అయ్యవార్లు పట్టం వర్మ ఓట్ల లెక్కింపుతో గాదెకు 12,035 ఓట్లు వచ్చినట్లుగా ప్రకటన
● కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మకు షాక్ ● టీడీపీ, జనసేన నేతలు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా పట్టించుకోని ఉపాధ్యాయులు ● ఫలించని ప్రజాప్రతినిధుల ప్రలోభాల ఎర ● తొమ్మిది నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం ఈ ఫలితం
సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాకిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బెత్తం దెబ్బ రుచి చూపించారు. పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలియతిరిగినా టీచర్లు కనికరించలేదు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఇచ్చి ప్రలోభాల ఎర వేసినా లొంగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా పరిణమించాయి.
ప్రలోభాల ఎర వేసినా.. ఏజెంట్ల అవతారమెత్తినా..
పాకలపాటి రఘువర్మ విజయానికి కూటమి నేతలు ఎన్ని ప్రలోభాల ఎర వేసినా.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎలక్షన్ ఏజెంట్ల అవతారమెత్తినా ఉపాధ్యాయులు కనికరించలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇటువంటి గౌరవప్రదమైన ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మకు ముందు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రఘువర్మ విజయం నల్లెరుపై నడకే అన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ పోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్దతు ఉన్న రఘువర్మను గెలిపిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రత్యేక పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ముట్టజెప్పారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద టెంట్లలో ఎన్నికల ఏజెంట్ల తరహాల్లో ఓటర్ స్లిప్పులను సైతం అందించారు. ఇలా ఎన్ని చేసినా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు.
తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై అనతికాలంలోనే అన్ని వర్గాలకు ఆశలు సన్నగిల్లాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పాటు పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ వంటి వాటి ప్రస్తావనే చేయకపోవడంపై కూడా ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి తమ దెబ్బ రుచి చూపించారు. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మను ఓడించి గాదె శ్రీనివాసులునాయుడును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకతను మూట్టగట్టుకోవడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగినప్పటికీ ఓటమి చడిచూడడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఈవీఎం కాదు.. బ్యాలెట్ విజయమిది.!
గాదె విజయానంతరం పీఆర్టీయూ మద్దతుదారులతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇది ఈవీఎం విజయం కాదనీ... బ్యాలెట్ బాక్సుల విజయమని కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment