యువకుడిని ఢీకొన్న స్కూల్ బస్సు
రోడ్డు దాటుతుండగా ఘటన
మర్రిపాలెం(విశాఖ): రోడ్డు దాటు తున్న ఓ యువకుడిని అతి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. సాక్షి దినపత్రికలో సీటీపీ స్కానింగ్ ఆపరేటర్ పనిచేస్తున్న పొట్నూర్ వెంకటేష్ కంచరపాలెం దరి కప్పరాడలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 25న విధులు ముగించుకుని.. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో కప్పరాడ వద్ద ఆటో దిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అక్కయ్యపాలెం నుంచి ఎన్‌ఏడీ వైపు వెళ్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఏపీ39 యూడబ్ల్యూ 3237) నంబర్ గల బస్సు అతివేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న వెంకటేష్‌ను ఢీకొంది. దీంతో యువకుడు సర్వీస్ రోడ్డులోని పోలీస్ స్టాపర్‌పై పడిపోవడంతో అతనికి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి వైద్య సేవలందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడికి ఇలా జరిగిందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ సీఐ దాశరథి నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment